పారదర్శక పాలన అందిస్తున్నాం
● ‘మధిర’ ప్రజలు తలెత్తుకుని తిరిగేలా చేస్తా ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఎర్రుపాలెం: ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దక్కేలా పారదర్శక పాలన అందిస్తామని, గ్రామ సభల్లో చర్చించిన తర్వాతే అర్హుల ఎంపిక జరగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని నర్సింహాపురం, బనిగండ్లపాడు, పెద్దగోపవరం, తక్కెళ్లపాడు, సఖినవీడు తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, బనిగండ్లపాడులో ప్రభుత్వ ఆస్పత్రి భవన ప్రారంభోత్సవం చేశారు. పెద్దగోపవరంలో సొసైటీ గోదాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మధిర నియోజకవర్గం నుంచి నాలుగు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపించిన ప్రజల కోసం నిరంతరం పని చేస్తూ వారి రుణం తీర్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. రాగద్వేషాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి రావాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈనెల 26 నుంచి అమలయ్యే నాలుగు సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామని, గ్రామసభల్లోనే అందరి సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని వివరించారు. అర్హత ఉండి కూడా పేర్లు రాకపోతే గ్రామసభలోనే తిరిగి నమోదు చేస్తామని చెప్పారు. ఎర్రుపాలెం మండలాన్ని పర్యాటకంగా అబివృద్ధి చేసేందుకు జమలాపురంలో అటవీ పార్కు, బుచ్చిరెడ్డిపాలెం, మామునూరు చెరువులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎర్రుపాలెంలో మరో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, బనిగండ్లపాడులో శిథిలమైన జూనియర్ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేలా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్ మూడో జోన్‌లో ఉన్న ఎర్రుపాలెం, మధిర మండలాల్లోని టైలాండ్ భూములకు సాగునీరు దక్కేలా రెండో జోన్‌లోకి తీసుకొచ్చామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. మధిరలో క్షీర విప్లవం తేవడానికి ఇందిరమ్మ డెయిరీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, డీపీఓ ఆశాలత, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, తహసీల్దార్ ఉషా శారద తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు..
సఖినవీడులో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, మండలాధ్యక్షుడు పంబి సాంబశివరావు, సొసైటీ చైర్మన్ ముల్పూరు శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment