రేపటి నుంచి గ్రామసభలు
● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● అర్హులకు అందనున్న సంక్షేమ పథకాలు
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, తదితరుల సహకారంతో ప్రజాపాలన దరఖాస్తులపై సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం గ్రామసభల్లో వీటిని ఆమోదించడం ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
గ్రామ సభల్లో అర్హుల ఎంపిక..
జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 589 పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు, పంచాయతీ ప్రత్యేకాధికారుల సమక్షంలో సభలు జరగనున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో సైతం వార్డు సభలను ఈ నెల 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను తహసీల్దార్లు, వ్యవసాయ శాఖాధికారులు పరిశీలన చేయనున్నారు.
అందనున్న పథకాలివే..
సాగుకు యోగ్యమైన భూమికి ఎకరానికి ఏడాదికి రైతు భరోసా కింద రూ.12 వేలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు రెండు విడతల్లో ఏడాదికి రూ.12 వేలు అందించనున్నారు. గత సంవత్సరం కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన వారికే ఈ ఇందిరమ్మ భరోసా పథకం వర్తించనుంది. ఇంకా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందనున్నాయి.
నిరంతరం ప్రక్రియ..
ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని, పథకం అందలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. సర్వేలో పేర్లు రానివారు తిరిగి గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని భరోసా కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment