![పీపీల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ckm520-191045_mr-1738866959-0.jpg.webp?itok=CqTegRGG)
పీపీలు, కానిస్టేబుళ్లకు సన్మానం
ఖమ్మంక్రైం: కీలకమైన రెండు హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు వారికి సహకరించిన కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ గురువారం సన్మానించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏ.శంకర్, బి.కృష్ణ్ణమోహన్‌తో పాటు ముదిగొండ, తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్ల కానిస్టేబుళ్లు అదినారాయణ, భద్రాజీ, హోంగార్డు యూసుఫ్‌ను సన్మానించాక సీపీ మాట్లాడారు. పక్కాగా దర్యాప్తు, సాక్షాల సేకరణ, చార్జీషీట్ల దాఖలతో పాటు కోర్టులో పటిష్టమైన వాదనలు వినిపించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చని నిరూపితమైందన్నారు. మిగతా కేసుల్లోనూ నిందితులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని సూచించారు. ట్రెయినీ ఐపీఎస్ రుత్విక్‌సాయి, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు మురళి, సంజీవ్, ఎస్సై జగదీశ్ పాల్గొన్నారు.
కాల్వలో ట్రాక్టర్ పడడంతో రైతు మృతి
● మొక్కజొన్న చేనుకు నీరు పెట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం
కొణిజర్ల: ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడగా రైతు మృతి చెందాడు. మండలంలోని పెద్దగోపతిలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి(30) తన తండ్రి, మాజీ సర్పంచ్ దానియేలుతో కలిసి మూడెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. ఆ పంటకు నీరు కట్టేందుకు గురువారం ఉదయం ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని మిత్రులు తడికమళ్ల కల్యాణ్, మొండితోక విజయ్‌తో కలిసి బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్లే క్రమాన ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వ కట్ట పైనుంచి కాల్వలో పడింది. దీంతో కల్యాణ్, విజయ్ కాల్వలోకి దూకి ప్రాణాలు దక్కించుకోగా, రవిపై ఇంజన్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు జేసీబీ సాయంతో ఆయన మృతదేహాన్ని, ట్రాక్టర్‌ను వెలికితీశారు. రవికి భార్య రాధమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు...
కారేపల్లి: ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో యువకుడు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం పేరుపల్లి–జమాళ్లపల్లి మధ్య బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం చల్లసముద్రం పరిధి వేములవాడకు చెందిన కల్తి విజయ్(30) ద్విచక్రవాహనంపై బుధవారం రాత్రి పేరుపల్లి వైపు వస్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్‌ఐ రాజారాం తెలిపారు.
మందు కలిపిన బియ్యం తినడంతో నాటుకోళ్లు...
తల్లాడ: మండలంలోని రంగంబంజరలో క్రిమిసంహారక మందు కలిసిన బియ్యం తిన్న 180 నాటుకోళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బానోత్ మోహన్ గురువారం పొలానికి వెళ్లగా ఆయన ఇంట్లో కుమారుడు మాత్రమే ఉన్న సమయాన గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కాపుసారా కాస్తున్నారంటూ సోదా చేశారు. ఈక్రమంలోనే ఎలుకల నివారణ కోసం క్రిమిసంహారక మందు కలిపిన ధాన్యాన్ని పారబోసి వెళ్లారు. ఈ ధాన్యాన్ని తిన్న రూ.1.50లక్షల విలువైన 180 కోళ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈమేరకు మోహన్ ఫిర్యాదుతో ఎస్‌ఐ బి.కొండల్‌రావు విచారణ చేస్తున్నారు.
![పీపీలు, కానిస్టేబుళ్లకు సన్మానం
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/staticobject_mr-1738866959-1.jpg)
పీపీలు, కానిస్టేబుళ్లకు సన్మానం
Comments
Please login to add a commentAdd a comment