బాలికల ఆరశ్రమంలో డీటీడీవో నిద్ర
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి రమాదేవి గురువారం రాత్రి బస చేసి విద్యార్థినుల్లో ధైర్యం నింపారు. రాత్రి నిర్వహించిన స్టడీ హవర్‌ను పరిశీలించారు. విద్యార్థినులు పడుకునే బెడ్‌పైనే నిద్రించారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామునే లేచి విద్యార్థినులకు యోగా, వ్యాయామం తరగతులు నిర్వహించారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పిల్లలను పాఠశాలకు పంపించాలని, వసతుల కల్పనలో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. వసతి గృహంలో పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. టీచింగ్ సిబ్బంది కూడా పేరెంట్స్‌తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తరగతులు నష్టపోయిన విద్యార్థినులకు స్పెషల్ క్లాసులు నిర్వహించి సిలబస్ రివిజన్ చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం బంబార ఆశ్రమ పాఠశాలను సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. దిశ మోడల్ స్కూల్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. వెల్గీ గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. ఆశ్రమ వసతిగృహాల్లోని టీచింగ్ సిబ్బంది క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం స్టడీ హవర్ నిర్వహించాలన్నారు. టైంటేబుల్ ప్రకారం సబ్జెక్ట్ టీచర్లు రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అనంతరం పాఠశాలలోనే నిద్ర చేయాలని తెలిపారు. ఉదయం స్టడీ హవర్ నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment