ప్రశాంతంగా గ్రూప్–2 పరీక్ష
● మొదటిరోజు 55 శాతం హాజరైన అభ్యర్థులు ● సెంటర్లను పర్యవేక్షించిన ఎస్పీ, కలెక్టర్ ● నిమిషం నిబంధనతో ముగ్గురు వెనక్కి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గ్రూప్–2 పరీక్ష మొదటిరోజు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్‌లో 9, కాగజ్‌నగర్‌లో 9 సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8:30 నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన మొదటి పేపర్‌కు 4,393 మంది అభ్యర్థులకుగానూ 2,455 మంది హాజరుకాగా 1,938 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన పరీక్షకు 4,393 అభ్యర్థులకుగానూ 2,440 మంది హాజరుకాగా 1,953 మంది గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధనతో జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ పాఠశాలలో ఒకరు, మోడల్ స్కూల్‌లో ఒకరు, గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఒకరు పరీక్ష రాయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు.
సెంటర్‌ల విజిట్ ....
జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల, మోడల్ స్కూల్, మాతృ శ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌తో పాటు పలు సెంటర్‌లను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గదుల్లో సరిపడా వెలుతురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష అనంతరం ఓఎంఆర్ షీట్స్‌ను స్ట్రాంగ్‌రూంకు తరలింపులో పోలీసు సిబ్బందికి ఎస్పీ తగు సూచనలు ఇచ్చారు. నేడు నిర్వహించనున్న పరీక్షకు అన్ని సౌకర్యాలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పేపర్లు పటిష్ట బందోబస్తు..
పరీక్ష పేపర్లను పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షల నోడల్ అధికారి లక్ష్మీనరసింహ, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కలెక్టరేట్‌లో ఉన్న స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లను కేటాయించిన పరీక్ష కేంద్రాలకు పటిష్టమైన బందోబస్తు మధ్య నిర్ణీత సమయంలో తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్ష పూర్తికాగానే ఓఎంఆర్ షీట్లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త, రూట్ అధికారులు, పర్యవేక్షకులు, డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment