మూతబడి!
లింగాపూర్ మండలంలోని పిట్టగూడ ప్రాథమిక పాఠశాల 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు సీఆర్టీలు పనిచేస్తున్నారు. వీరిద్దరూ సమ్మెలో ఉండటంతో పాఠశాల మూతబడింది.
తిర్యాణి మండలం రొంపెల్లి ఆశ్రమ పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతోంది. ఇక్కడ 110 మంది విద్యార్థులు ఉన్నారు. 12 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో తొమ్మిది మంది సీఆర్టీలే ఉన్నారు. ప్రస్తుతం వారు సమ్మెలో ఉండటంతో ముగ్గురు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఎనిమిది తరగతుల విద్యార్థులను ఒకేచోట ఉంచి బోధిస్తున్నారు. అలాగే మండలంలోని మంగీ గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉంది. ఇక్కడ తొమ్మిది మంది ఉపాధ్యాయుల్లో ఒక్కరే రెగ్యులర్ టీచర్ ఉండటంతో బోధన కష్టమవుతోంది.
పెంచికల్‌పేట్ మండలంలోని కోయచిచ్చాల గిరిజన ప్రాథమిక పాఠశాల కొన్ని రోజులుగా తెరుచుకోవడం లేదు. సీఆర్టీలు డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగడంతో పాఠశాలకు తాళం పడింది. విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. అలాగే నందిగామ గిరిజన ప్రాథమిక పాఠశాల కూడా మూతబడింది.
తిర్యాణి(ఆసిఫాబాద్): గిరిజన సంక్షేమ శాఖ పరిధి లోని పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ) లే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని ప్రభుత్వం ఏటా రెన్యువల్ చేస్తోంది. అయితే తమ సర్వీసు క్రమబద్ధీకరించడంతో పాటు కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఆర్టీలు ఈ నెల 16 నుంచి సమ్మె బాటపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో గిరిజన సంక్షేమ పరిధిలోని పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఏకోపాధ్యాయ బడులకు తాళం
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలతో పాటు పలు ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 458 మంది సీఆర్టీలు ఉండగా, దాదాపు 70కి పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు సీఆర్టీలపై ఆధారపడి నడుస్తున్నాయి. సమ్మె కారణంగా ఏకోపాధ్యాయ గిరిజన సంక్షేమ పాఠశాలల తాళాలు తీసేవారు కరువయ్యారు. పదో తరగతి విద్యార్థులకు ఈ నెలాఖరు వరకు సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. చాలాచోట్ల సిలబస్ పూర్తి కాలేదు. సీఆర్టీలు బోధించే సబ్జెక్టులు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అలాగే వార్షిక పరీక్షల ఫలితాలపైనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే రెగ్యులర్ టీచర్లు ఉండటంతో విద్యాబోధన కష్టమవుతోంది. కొరత కారణంగా అన్ని తరగతుల విద్యార్థులను ఒకేచోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు.
సీఆర్టీల ప్రధాన డిమాండ్లు
మినిమం టైం స్కేల్(ఎంటీఎస్)తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
సర్వీసు క్రమబద్ధీకరించాలి.
ప్రతినెలా 1న గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించాలి.
మహిళా ఉద్యోగులకు వేతనం కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తింపజేయాలి.
పీఎఫ్ సౌక్యరం కల్పించాలి. హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
61 ఏళ్లు నిండిన వారికి రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి.
సమ్మె బాట పట్టిన సీఆర్టీలు
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని స్కూళ్లపై ప్రభావం
మూతబడిన ఏకోపాధ్యాయ పాఠశాలలు
నష్టపోతున్న విద్యార్థులు
విద్యార్థులు నష్టపోకుండా చర్యలు
సీఆర్టీల సమ్మె కారణంగా విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా సీఆర్టీలు విధులు నిర్వర్తిస్తు న్న ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరిపించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని రెగ్యుల ర్ ఎస్జీటీలను పంపిస్తాం. బడులు మూతబడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
– రమాదేవి, డీటీడీవో
విద్యార్థులకు నష్టం
సీఆర్టీల సమ్మెతో గిరిజన ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరచుకోవడంతో లేదు. ఇప్పటికే పది రోజులు విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. – కోట్నాక గణపతి,
ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు
సర్వీసు క్రమబద్ధీకరించాలి
ప్రస్తుతం సీఆర్టీలకు ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ప్రతినెలా 1న క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఏడాదికోసారి రెన్యువల్ పద్ధతి కాకుండా సర్వీసును క్రమబద్ధీకరించాలి. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం.
– కుర్సెంగ శ్రీనివాస్,
సీఆర్టీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment