‘ఆయుర్వేదం’పై నిర్లక్ష్యం
● జిల్లాలోని వైద్యశాలలపై ప్రభుత్వం చిన్నచూపు ● వైద్యులు, సిబ్బంది కొరతతో అందని సేవలు ● నియామకాలపై దృష్టి సారించని వైనం
చింతలమానెపల్లి(సిర్పూర్): ప్రస్తుతం ఆయుర్వేద వైద్యానికి పట్టణాలు, నగరాల్లోని ప్రజలు సైతం మొగ్గు చూపుతున్నారు. కానీ జిల్లాలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా బెజ్జూర్ మండల కేంద్రం, కౌటాల మండలం గురుడుపేట్, వాంకిడి మండల కేంద్రం, దహెగాం మండలం బీబ్రా, ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంటలో ఐదు ఆయుర్వేద వైద్యశాలలు ఏర్పాటు చేశారు. వీటిని ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలుగా కూడా పిలుస్తున్నారు. ఆయాచోట్ల స్థాయిని అనుసరించి వైద్యుడు, ఫార్మసిస్ట్(కంపౌండర్), అటెండర్ పోస్టులు ఉన్నాయి. వైద్యుడు రోగులను పరిశీలించాల్సి ఉండగా కంపౌండర్ మందులను అందిస్తాడు. అటెండర్ ఆస్పత్రి నిర్వహణ విధులు నిర్వర్తిస్తారు.
వైద్యులు లేరు.. సిబ్బంది కొరత
ఆయుర్వేద డిస్పెన్సరీలు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నేళ్లుగా వైద్యులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. బెజ్జూర్, బీబ్రా, చిర్రకుంట ఆయుర్వేద వైద్యశాల మినహా ఆయుర్వేద వైద్యశాలల్లో డాక్టర్లు లేరు. బెజ్జూర్ ఆయుర్వేద వై ద్యురాలు నేహ సైతం దీర్ఘకాలిక సెలవులో ఉన్నా రు. బీబ్రా వైద్యుడు రాజేందర్ బీబ్రాలో మూడురోజులు, వరంగల్ జిల్లాలో మూడు రోజులపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. చిర్రకుంట వైద్యురాలు శిరీష డెప్యుటేషన్‌పై వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నా రు. బెజ్జూర్ ఆయుర్వేద వైద్యశాలలో కంపౌండర్ ఆశోక్ గౌడ్, గురుడుపేటలో అటెండర్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. చిర్రకుంట, వాంకిడిలో ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది లేకపోవడంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించారు.
ఆయుర్వేదం ప్రాముఖ్యత
ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. మందులు వాడడంతో ఇతర రుగ్మతలు లేకపోవడం. ఖరీదు తక్కువగా ఉండడం, సంప్రదా య వనరుల వినియోగంతో దీని ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం సత్ఫలితాలు ఇస్తుందనే అభిప్రాయం ఉంది. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆయుర్వే ద వైద్యశాలల్లో వైద్యులు లేకపోవడంతో మందులు అందడం లేదు. డాక్టర్లు ఉన్న వాటికే మందులు పంపిణీ ఉంటుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఐదు వైద్యశాలల్లో ముగ్గురు వైద్యాధికారులను నియమించారు. మరో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారుల కొరత ఉన్నా డెప్యుటేషన్‌పై ఇతర జిల్లాల్లో విధులకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయుర్వేదాన్ని చేరువ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నా రు. అన్ని మండల కేంద్రాలలో ఆయుర్వేద వైద్యశాలలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సర్దుబాటు చేస్తున్నాం
జిల్లావ్యాప్తంగా ఆయుర్వేద వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉంది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న వైద్యులు త్వరలో విధుల్లో చేరుతారు. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం.
– సందీప్, జిల్లా ఆయుష్ ప్రోగ్రాం అధికారి
యోగాపై శిక్షణ
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాపై శిక్షణ ఇస్తున్నాం. యోగాసనాల ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు. శిక్షణ కేంద్రాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయుర్వేదం, యోగాపై ప్రజల్లో ఆసక్తి ఉంది. ఆయుర్వేద వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దాసరి వినోద్, గురుడుపేట్, మం.కౌటాల
Comments
Please login to add a commentAdd a comment