సింగరేణి జిగేల్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి జిగేల్‌

Published Fri, Dec 27 2024 1:38 AM | Last Updated on Fri, Dec 27 2024 1:38 AM

సింగరేణి జిగేల్‌

సింగరేణి జిగేల్‌

శ్రీరాంపూర్‌: రాష్ట్రంలో పెరెన్నిక గల సింగరేణి సంస్థ 2024లో జిగేల్‌మని మెరిసింది. అనుకున్న లక్ష్యాలను సాధించిన సంస్థ అభివృద్ధి పథంలో పయనించింది. కంపెనీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసింది. 70.20మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసుకుంది. ఆ లక్ష్యాన్ని అధిగమించేలా ఈసారి 2024–25లో 72మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇంత పెద్దమొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేసి ఆల్‌టైం రికార్డును నెలకొంది. దీంతో కంపెనీ రూ.4,701 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇందులో పెట్టుబడులు పోను మిగిలిన రూ.2,412 కోట్ల నుంచి 33శాతం వాటాగా రూ.796 కోట్లను కార్మికులకు వాటా రూపంలో పంపిణీ చేసింది. గత సంవత్సరం కంటే ఒక శాతం పెంచి ఇవ్వడంతో ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు వాటా డబ్బులు వచ్చాయి.

కాంట్రాక్ట్‌ కార్మికులకు కొత్తహక్కు

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కంపెనీ లాభా ల్లో వాటా కోసం చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేయగా.. చివరికి ఈసారి బోనస్‌ చెల్లించారు. లాభా ల్లో నుంచి కార్మికులకు రూ.5వేల చొప్పున బొనస్‌ అందజేశారు. దీంతో సుమారు 30వేల మంది వరకు ప్రయోజనం పొందారు. సింగరేణిలో కొత్తగా 2,165 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇందులో కారుణ్యం నియామకాలు 1367, ఎక్స్‌టర్నల్‌ ద్వారా 796 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీంతోపాటు కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంటును కంపెనీ ప్రారంభించింది. మూడేళ్లుగా నలుగుతూ వస్తున్న ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్‌కు ముందడుగు పడింది. జూలై 12న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒడిశా వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో చర్చించి దానికి కావాల్సిన అన్ని రకాల అక్కడి ప్రభుత్వ అనుమతులు సాధించారు. దీంతో 2025 జనవరి నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలు కానుండంతో మరో మైలు రాయిగా చెప్పవచ్చు. ప్రమాదాలు కూడా 2023 కంటే తగ్గాయి. 2024లో వివిధ ప్రమాదాల్లో ఐదుగురు కార్మికులు మరణించారు.

బీమా తెచ్చిన ధీమా..

గని ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని మొదటిసారిగా కంపెనీ కల్పించింది. కంపెనీ చూపిన బ్యాంకుల్లో సాలరీ అకౌంట్‌ను ప్రారంభించుకునేలా ప్రోత్సహించి వారికి ఈ సౌకర్యం వర్తింపజేసింది. దీంతోపాటు కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా రూ.30 లక్షల బీమా సౌకర్యం కల్పించారు. కారుణ్య ఉద్యోగుల వయస్సు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. సింగరేణి నిధులు కేటాయించిన రామగుండంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం 7 సీట్లను కేటాయించారు. నాలుగేళ్ల తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికలైన స్ట్రక్చర్‌ కమిటీ సమావేశాలు మొదలయ్యాయి. గుర్తింపు సంఘం, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో కార్మికుల అనేక పెండింగ్‌ డిమాండ్లు పరిష్కారానికి నోచుకున్నాయి. ఇదిలా ఉంటే సామాజిక బాధ్యతలో భాగంగా సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులు 135 మందికి రాజీవ్‌ సివిల్స్‌ అభయహస్తం కింద సింగరేణి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక నగదు అందజేసింది. పర్యావరణహిత మైనింగ్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి గాను సింగరేణి జాతీయ స్థాయిలో కేంద్రం ఎలక్ట్రిసిటీ అఽథారిటీ సంస్థ అవార్డును అందించింది. ఇలా సింగరేణికి అన్ని రంగాల్లో 2024లో శుభాలే జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement