అమ్మా.. కరుణించు..
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద ప్రాంతమైన కెరమెరి మండలం ముకదంగూడ గ్రామపంచాయతీ పరిధి మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి ఆలయం జాతరకు ముస్తాబైంది. బుధవారం నుంచి ఈ నెల 28వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. నెలపాటు ఆదివాసీల ఆరాధ్యదైవం.. అమ్మవారి ఆలయం జనసంద్రం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే రోడ్డు సౌకర్యం కల్పించారు. మహరాజ్‌గూడ అడవుల్లోని బోరు నుంచి పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించనుండగా.. హాల్, పోచమ్మ ఆలయానికి రంగులు వేశారు. 20 సోలార్ విద్యుత్ లైట్లు అమర్చారు. ఆలయం వరకు సీసీ రోడ్డు వేశారు. గ్రామపంచాయతీ సిబ్బందితో ఏరోజుకారోజు పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లతో అభివృద్ధి చేయడం గమనార్హం. ఈ సంవత్సరం జంగుబాయి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తాగునీటితో పాటు రోడ్డు, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, ప్రత్యేక పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించింది. ఇటీవల జంగుబాయి ఉత్సవాలపై హట్టిలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా పత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎనిమిది గోత్రాలు ఒకే వేదికపై..
వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హెర్రకుంరం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పుజారులుగా వ్యవహరిస్తారు. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికీ మొక్కు తీర్చుకుంటారు. ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారు చేస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో గుహలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడున్న మైసమ్మ, పోచమ్మ, రావుడ్ దేవతల వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కు తీర్చుకుంటారు. రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలు చేస్తారు.
ప్రభుత్వ గుర్తింపుతో అభివృద్ధి
ఏడేళ్ల క్రితం బీఆర్‌ఎస్ ప్రభుత్వం జంగుబాయి ఉత్సవాలకు గుర్తింపునిచ్చింది. ఏటా అభివృద్ధి కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తారు. పూజాసామగ్రికి వెచ్చిస్తారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఆదివాసీలు రానున్నారు. తారురోడ్డు సౌకర్యం లేకున్నా రాళ్లు, రప్పలు, దుమ్ము, ధూళిలోనూ కొందరు కాలినడకన వస్తే.. మరికొందరు ఎడ్ల బండిపై వస్తారు. సుమారు వెయ్యికిపైగా ఎడ్లబండ్లు రావచ్చని నిర్వాహకుల అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇలా వెళ్లాలి..
జంగుబాయి పుణ్యక్షేత్రానికి కెరమెరి మండలంలోని ఆనార్‌పల్లి మీదుగా ఉమ్రి వంతెన నుంచి పరందోళి మీదుగా, లేదా పరంధోళి సమీపం నుంచి ముకదంగూడ గ్రామానికి ఆనుకుని ఉన్న కచ్చా రోడ్డుపై వెళ్లవచ్చు. నార్నూర్ క్రాస్ రోడ్డు నుంచి కొత్తపల్లి మీదుగా, ఆదిలాబాద్ నుంచి లొకారి మీదుగా కూడా జంగుబాయి ఆలయం వరకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.
సౌకర్యాలు కల్పించాం
జంగుబాయి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాం. ముకదంగూడ అడవుల్లోని బోరు నుంచి పైపులు బిగించి నీటిని సరఫరా చేస్తాం. పారిశుధ్య నిర్వహణకు గ్రామపంచాయతీ సిబ్బందిని నియమించాం. నెలపాటు వారు ఇక్కడే ఉండి ఆలయ ఆవరణను శుభ్రంగా ఉంచుతారు.
– అమ్జద్‌పాషా, ఎంపీడీవో
28వరకు జాతర
బుధవారం నుంచి జంగుబాయి ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆలయ ప్రాంగణంలో తెలంగాణ–మహారాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. రహదారికి ఇబ్బంది లేకుండా బీటీ రోడ్డు వేశారు. విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. సోలార్ లైట్లు కూడా అమర్చారు.
– మరప బాజీరావు,
అలయ కమిటీ గౌరవాధ్యక్షుడు
వనక్షేత్రంలో జంగుబాయి దేవత
నేటి నుంచి నెలపాటు జాతర
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి
గుహలోనే దేవత..
జంగుబాయి దేవత గుహలో బస చేసి ఉంది. గుహ కావడంతో అక్కడికి భక్తులు కూర్చునే వెళ్తారు. చీకట్లో వెలుగుతున్న దీపం రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు విశ్వసిస్తారు. పుష్యమాసం నుంచి అమావాస్య వరకు జాతర కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నియమనిష్టలతో పాదరక్షలు లేకుండానే నడుస్తూ వస్తారు. నెలపాటు కటిక నేలపైనే పడుకుంటారు. దీపారాధనతో ప్రారంభమయ్యే ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment