‘ఉపాధి’ అండ!
ఆసిఫాబాద్‌అర్బన్: వలసలు, కరువును అరికట్టేందుకు అమలు చేస్తున్న ఉపాధిహామీ పథ కం రైతులు, పశువుల యజమానులకు సైతం అండగా నిలిస్తోంది. ఈ పథకం కింద పశువుల పాకలు, నీటికుంటలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందశాతం రాయితీ కల్పిస్తుండటంతో అన్నదాతలకు మేలు జరగనుంది. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. మండలానికి పది చొప్పున 150 పశువుల పాకలు, మండలానికి ఐదు చొప్పున 75 నీటి కుంటలు మంజూరయ్యాయి. పశువుల పాక నిర్మించే స్థలం విస్తీర్ణం, నిర్మాణం తీరును బట్టి నిధులు మంజూరు చేస్తారు. మార్చిలోగా లక్ష్యం చేరుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో వ్యవసాయం తర్వాత రైతులు ఎక్కువ మంది పశు సంపదపై ఆధారపడుతున్నారు. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పశు సంపద ఏటా వృద్ధి చెందుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాలు, మిగిలిన మండలాల్లో పాడి రైతులు తమ పశువులను ఆరుబయట, చేల వద్ద ఉంచుతున్నారు. ఈ తరుణంలో జిల్లాలో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల దాడిలో గాయపడుతున్నాయి. పశువుల పాకల నిర్మాణం పూర్తియితే రైతులకు మేలు జరగనుంది. పశు సంపదను మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన వారు స్థానిక గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈజీఎస్ అధికారులు సూచిస్తున్నారు.
చిన్న, సన్నకారు రైతులకు నీటి కుంటలు
ఇక ఉపాధిహామీ నిధులతో పశువుల పాకలతోపాటు నీటి కుంటల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. అయితే ఇవి మొదట చిన్న, సన్నకారు రైతులకే వర్తింపజేయనున్నారు. జిల్లాకు 75 యూనిట్లు మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా సాగునీటి వనరులు అంతంతే ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టుల కింద కూడా రెండు పంటలకు సాగునీరందని పరిస్థితి ఉంది. నీటి కుంటలు మారుమూల ప్రాంతాల్లోని రైతులకు ఉపయోగకరంగా మారనున్నాయి. పశువుల పాకలు, నీటి కుంటల నిర్మాణానికి అర్హులకు వందశాతం రాయితీ అందించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధిహామీ పథకం కింద పశువుల పాకలు, నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న వందశాతం రాయితీని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. మార్చి 31లోగా లక్ష్యం మేరకు నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
వందశాతం రాయితీతో పశువుల పాకలు, నీటికుంటలు
సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
Comments
Please login to add a commentAdd a comment