మునిసిపాలిటీల్లో మురుగుశుద్ధి | - | Sakshi
Sakshi News home page

మునిసిపాలిటీల్లో మురుగుశుద్ధి

Published Fri, Jan 3 2025 12:25 AM | Last Updated on Fri, Jan 3 2025 12:25 AM

-

కైలాస్‌నగర్‌: మున్సిపాలిటీల్లో మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చాలని, డ్రైనేజీల్లో ప్రవహించే ము రుగునీటితో కలిగే ఇబ్బందులకు చెక్‌పట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 కింద అన్ని మున్సిపాలిటీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలతో పాటు మురుగునీటిని శుద్ధి చేసేందుకు సివేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ)ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు రూ.123కోట్ల 98లక్షల 97వేలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్‌ ప్రక్రియను రాష్ట్రస్థాయిలోనే ప్రజా రోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఎస్టీపీల నిర్మాణ బాధ్యతలను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించే కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.123.98 కోట్లు మంజూరు

మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి వ్యవస్థ లేక డ్రైనేజీల నుంచి ప్రవహించే నీరంతా పంటచేలు, చెరువుల్లోకి చేరుతోంది. దీంతో అవి కలుషితమవుతున్నాయి. దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇలాంటి మురుగు సమస్యను పూర్తిగా దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0లో భాగంగా ప్రతీ మున్సిపాలిటీలో ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలుండగా ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి ఎస్‌బీఎం–1లోనే రూ.225 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి నిర్మాణాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. మరో 11 మున్సిపాలిటీలకూ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నిర్మల్‌ మున్సి పాలిటీకి రూ.18.86 కోట్లు కేటాయించగా, మంచిర్యాలకు రూ.18.22 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు జనాభాకు అనుగుణంగా కేటాయించింది.

ప్రత్యేక పైపులైన్ల ద్వారా..

పట్టణాల్లోని డ్రైనేజీల గుండా వెళ్లే మురుగునీటినంతా ఒక్కచోటకు తీసుకువచ్చేలా ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ డ్రైనేజీలే కాకుండా ఇళ్లు, హోటళ్లు, ధోబీఘాట్‌లలో పోగయ్యే మురుగునీటినంతా అక్కడికి చేర్చేలా చర్యలు చేపడతారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎస్టీపీలు నిర్మిస్తారు. వీటి నిర్వహణ బాధ్యతలు ఎంపిక చేసిన ఏజెన్సీలకే అప్పగిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు హైబ్రిడ్‌ యాన్యూటి మోడల్‌లో నిర్మాణాలు చేపట్టనున్నారు. మురుగునీటిని ఎస్టీపీకి సేకరించడం నుంచి శుద్ధి చేసి తిరిగి వదిలే వరకూ నిర్వహణ బాధ్యతలు సంబంధిత ఏజెన్సీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. పదేళ్ల వరకు వాటిని నిర్వహించేలా టెండర్‌ ప్రక్రియలో నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. వీటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. త్వరలోనే వీటి నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాలు పూర్తయితే త్వరలోనే మురుగునీటి సమస్య తీరడంతో పాటు నీటి వనరులు కలుషితం కాకుండా ఉండే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టెండర్‌ ప్రక్రియ సాగుతోంది

మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 కింద ఎస్టీపీలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసింది. నిర్మాణాలకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ రాష్ట్రస్థాయిలోనే జరగనుంది. తొమ్మిది మున్సిపాలిటీలకు కలిపి ఒక యూనిట్‌గా టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశముంటుంది. ఇందుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు అందలేదు.

– గంగాధర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ, ఆదిలాబాద్‌ జిల్లా

బల్దియాల వారీగా మంజూరైన నిధులు

మున్సిపాలిటీ మంజూరైన

నిధులు(రూ.లలో)

భైంసా 10,36,14,536

నిర్మల్‌ 18,86,37,940

ఖానాపూర్‌ 7,06,64,834

బెల్లంపల్లి 10,75,45,535

మందమర్రి 10,04,15,596

మంచిర్యాల 18,22,63,427

క్యాతన్‌పల్లి 8,52,28,553

లక్సెట్టిపేట 7,68,28,073

చెన్నూర్‌ 9,25,38,602

నస్పూర్‌ 12,67,86,900

కాగజ్‌నగర్‌ 10,53,73,363

ఉమ్మడి జిల్లాలోని 11 బల్దియాల్లో

సివేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం

రూ.123.98 కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement