అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
కాగజ్‌నగర్‌రూరల్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రె అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలో ని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగుకు యోగ్యం కాని రాళ్లు, గుట్టలు, నివాస గృహాలు, వెంచర్లు, లేఅవుట్లు, అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములు, ఇరిగేషన్ భూములు, చెరువులు, కాలువలు, రహదారులు, రైల్వేలైన్‌ల కోసం కేటాయించిన భూములను రైతు భరోసా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితాను రూపొందించాలన్నారు. అర్హత గల ప్రతీ కుటుంబానికి రేషన్‌కార్డు అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు పథకాల వారీగా అధికారులను నియమించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండలంలోని ఎన్జీవోస్ కాలనీలో రేషన్‌కార్డుల సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ కిరణ్, డివిజన్‌లోని తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Comments
Please login to add a commentAdd a comment