● జిల్లాలో మరిన్ని సహకార సంఘాలు ● 12 సంఘాలు, 23,788 మంద
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సహకార సంఘాల సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ముందుగా ఆయా పీఏసీఎస్‌లు, ఎమ్మెల్యేల నుండి ప్రతిపాదనలను జిల్లా సహకార శాఖ స్వీకరించింది. జిల్లాలో నూతనంగా 3 సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు.
గ్రామాల్లో సేవల విస్తరణకు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 23,788 మంది సభ్యులు ఉన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు, పంట రుణాల పంపిణీ, గిడ్డంగులు, పెట్రోల్ బంకులు, ఇలా పలు సేవలను రైతులకు అందిస్తున్నాయి. కొత్తగా మండలాలు ఏర్పడినప్పుటికీ మండల కేంద్రాల్లో పీఏసీఎస్‌లు లేవు. ఈ క్రమంలో అన్ని మండల కేంద్రాల్లో, అవసరం ఉన్న గ్రామాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
15కు చేరనున్న సంఘాలు
గతంలో నష్టాల్లో ఉన్న సంఘాలను మరో సంఘంలో విలీనం చేశారే తప్పా కొన్నేళ్లుగా నూతన సంఘాలు ఏర్పాటు చేయలేదు. పలు పాత, కొత్త మండల కేంద్రాల్లో సైతం సంఘాలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు చొప్పున సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు స్వీకరించింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. కొత్తగా 3 సంఘాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో సహకార సంఘాల సంఖ్య 15కు చేరనుంది. దీంతో రైతులకు అందుబాటులో సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
ప్రతిపాదనలు పంపించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలు స్వీకరించాం. అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదించాం. జిల్లాలో కొత్తగా పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి, లింగాపూర్‌లో సంఘాలను ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం. నూతనంగా ఏర్పడే సంఘాలతో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.
– రాథోడ్ బిక్కు, జిల్లా సహకార అధికారి
Comments
Please login to add a commentAdd a comment