భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: రోడ్డు భద్రతా మాసోత్సవాలు వి జయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రవాణా, ఆర్టీసీ, వి ద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతీ జిల్లాలో అవగాహన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలన్నారు. నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనదారుల లైసెన్సు రద్దు చేసి, భవిష్యత్తులో వారు తిరిగి పొందకుండా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్, ఆర్టీసీ డీఎం విశ్వనాథ్, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45 ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు మూల మలుపుల గుర్తింపు, స్పీడ్ బ్రేకర్లు, సూచికలు ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. పట్టణాల్లోని కూడళ్ల వద్ద రోడ్డు ఆక్రమణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment