శరన్నవరాత్రులకు సిద్ధం
పటమట(విజయవాడతూర్పు): శ్రీ దేవి శరన్నవరాత్రులకు వీఎంసీ కూడా సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీఎంసీ ప్రజారోగ్య విభాగం పారిశుద్ధ్య నిర్వహణ చేస్తుండగా, ఎస్టేట్ విభాగం క్లోక్‌రూం, చెప్పుల స్టాండ్, ఇంజినీరింగ్ విభాగం తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టారు. దసరా ఉత్సవాలతోపాటు ప్రారంభానికి ఒక రోజు ముందు, ముగింపు తర్వాత మరోరెండు రోజులు దుర్గగుడి పరిసర ప్రాంతాల్లో వీఎంసీ వసతులను సమకూరుస్తుంది. ఇక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా వీఎంసీ 8181960909 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని వీఎంసీ అధికారులు సూచించారు.
నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ
అక్టోబర్ 2 నుంచి 15వ తేదీ వరకు వీఎంసీ ప్రజారోగ్య విభాగం పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుంది. ఘాట్ల శుభ్రం, వ్యర్థాల తరలింపు, రోడ్లు, క్యూలైన్ల శుభ్రతకు, దుర్గగుడి ఘాట్ ఓం మలుపు వరకు వీఎంసీనే పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుంది. దీనికి 1400 మంది కార్మికులను మూడు షిప్టుల్లో విధులు కేటాయించారు. నగరంలోని 32 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు శానిటరీ సూపర్‌వైజర్లతోపాటు ముగ్గురు అసిస్టెంట్ మెడికల్ అధికారులు నిరంతరం విధులు నిర్వహించనున్నారు. కృష్ణవేణి ఘాట్‌లో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేయగా, వ్యర్థాల తరలింపునకు 30 వాహనాలు ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా, క్లోక్‌రూంలు, క్యూలైన్లలో భక్తుల నుంచి వచ్చే వ్యర్థాలను సేకరించడానికి 80 లీటర్ల సామర్థ్యమున్న 500 డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు.
తాత్కాలిక మరుగుదొడ్లు
ఉత్సవాలు జరిగే 8 ప్రాంతాల్లో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాట్లు చేసింది. వీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న హోర్డింగ్ ఏరియాలో, పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా, రాజీవ్‌గాంధీ పార్కు వెంబడి, కృష్ణవేణి ఘాట్లలో, టీటీడీ పార్కింగ్ స్థలంలో, పున్నమి ఘాట్ పార్కింగ్ ఏరియా, కెనాల్ రోడ్డు, భవానీ ఘాట్‌లో 12 రోజుల పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నీటి సరఫరా, జరగాలని, వ్యర్థ నీరు ఎప్పటికప్పుడు పారేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాగునీటి సరఫరా
భక్తుల దాహార్తి తీర్చడానికి 25 ప్రాంతాల్లో 500 ఎంఎల్ తాగునీటి సీసాలను వీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అందించనుంది. ఉత్సవాల్లో 24 గంటలూ మూడు షిప్టుల్లో 90 మంది సిబ్బంది భక్తులకు తాగునీటి బాటిల్స్‌ను అందిస్తారు. ఇందుకు వీఎంసీ 32 లక్షల తాగునీటి బాటిల్స్‌ను ఏర్పాటు చేసింది.
చెప్పుల స్టాండ్, క్లోక్‌రూం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వారి వస్తువులు, లగేజీ, చెప్పులు పెట్టుకునేందుకు వీఎంసీ ఎస్టేట్స్ విభాగం ఆరు ప్రాంతాల్లో క్లోక్‌రూం–చెప్పుల స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకుగాను 30 కౌంటర్లను ఏర్పాటు చేసింది. అత్యధికంగా రథం సెంటర్ వద్ద 10 కౌంటర్లు, సీతమ్మవారి పాదాల వద్ద నాలుగు కౌంటర్లు, వీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న హోర్డింగ్ ప్రాంతంలో నాలుగు, పున్నమిఘాట్ వద్ద నాలుగు, కుమ్మరిపాలెం సెంటర్, హెడ్‌వాటర్‌వర్క్స్ వద్ద నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా అత్యవసరం మేరకు మొబైల్ క్లోక్‌రూం, చెప్పులస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం రాజీవ్‌గాంధీ పార్కు ఎదురుగా ఉన్న సీఎన్‌జీ బంక్ వద్ద కూడా ఏర్పాటు చేశారు.
● శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ఈవో రామరావు, డెప్యూటీ ఈవో రత్నరాజు, ఆర్‌జేసీ ఎన్‌వీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఘాట్ల శుభ్రతకు 1400 మంది వీఎంసీ కార్మికులు 8 ప్రాంతాల్లో తాత్కాలిక టాయిలెట్లు 25 ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు ఆరు ప్రాంతాల్లో క్లోక్‌రూం, చెప్పుల స్టాండ్లు
Comments
Please login to add a commentAdd a comment