సామాజిక రుగ్మతలపై పోరాడిన జాషువా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సామాజిక రుగ్మతలను ఎదిరించి పోరాడిన విశ్వనరుడు గుర్రం జాషువా అని, ఆయన సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యాన శనివారం కవికోకిల గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఎంపిక చేసిన కర్రి సంజీవరావు(శిఖామణి), దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, టి.వరప్రసాద్, పి.రమణయ్యలకు గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం –2024 ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఒక్కో పురస్కార గ్రహీతకు జ్ఞాపికతో పాటు రూ.50 వేల చెక్కును ప్రభుత్వం తరఫున మంత్రి అందించారు. ఈ సందర్భంగా కవి సంచిక మాసపత్రిక 50వ సంచికను ఆవిష్కరించారు. కలెక్టర్ డాక్టర్ జి.సృజన, యువజనాభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వాడ్రేవు వినయ్ చంద్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఎ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకా తిరుమలకు ఏఈవో రమేష్‌బాబు బదిలీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఏఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్.రమేష్‌బాబును ద్వారకా తిరుమలకు బదిలీ చేస్తూ దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలో ఏఈవోల బదిలీలు రెండుకు చేరాయి. ఇటీవల ప్రభుత్వం దేవస్థాన ఏఈవో వెంకటరెడ్డిని బదిలీ చేసింది. ఆలయంలో మొత్తం ఐదుగురు ఏఈవోలు విధులు నిర్వహిస్తుండగా దసరా ఉత్సవాలకు మరో నాలుగు రోజుల ముందుగా ఇద్దరు ఏఈవోల బదిలీలు దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారాయి.
ఈవీఎంల గోడౌన్ వద్ద అప్రమత్తం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్ల పూడిలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ డాక్టర్ సృజన శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గోడౌన్‌కు వేసి ఉన్న సీలు, ఈవీఎంల రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం గోడౌన్ పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఈవీఎంల గోడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ఈవీఎంలు, వీవీప్యాట్స్, గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ట్యాలీలో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువతకు అకౌంట్స్ ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దేవరపల్లి విక్టర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీలో తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి ఇంటర్, డిగ్రీ, బీటెక్ (పాస్ లేదా ఫెయిల్) అభ్యర్థులు శిక్షణ పొందడానికి అర్హులని తెలిపారు. ఆసక్తిఉన్నవారు అక్టోబర్ 3వ తేదీలోపు కానూరు తులసీనగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీకి విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 87146 92749, 87146 92748 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment