చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు):ఎలుకల మందు సేవించి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... విజయనగరం జిల్లా మధురవాడకు చెందిన లోకారపు గాంధీ (39) టైల్స్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన భార్యతో గొడవపడి మనస్తాపం చెంది విజయనగరం నుంచి బయలుదేరి నగరానికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు తన బంధువులకు ఫోన్ చేసి ఎలుకల మందు తాగి చనిపోతున్నానని చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బస్టాండ్ పరిసరాల్లో వెతకగా రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు బాలురు అదృశ్యం
కోనేరుసెంటర్: మచిలీపట్నంకు చెందిన ముగ్గురు బాలురు అదృశ్యమయ్యారు. తప్పిపోయిన బాలురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలురు ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం కాలేఖాన్‌పేట యానాదులకాలనీకి చెందిన తుమ్మ రాఘవులు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. భార్య ఇటీవలే కాలం చేసింది. వీరికి ఎనిమిదేళ్ళ వయసు కలిగిన తుమ్మ శ్రీనివాసరావు, ఆరేళ్ళ వయసు ఉన్న దుర్గారావు, మూడేళ్ళ వయసు కలిగిన నాగేశ్వరరావు అనే ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. వీరిలో శ్రీనివాసరావు, దుర్గారావులు కాలేఖాన్‌పేటలోని మునిసిపల్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. మూడో కుమారుడు అంగన్‌వాడీకి వెళుతున్నాడు. ఇదిలా ఉండగా రాఘవులు శుక్రవారం రోజులానే పొలం పనులకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ముగ్గురు పిల్లలు సుమారు 7.30 గంటల సమయంలో స్కూలుకు అని చెప్పి బయటికి వెళ్లారు. అలా వెళ్లిన పిల్లలు ముగ్గురు ఇంటికి తిరిగిరాలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన రాఘవులుకు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాఘవులు పిల్లల ఆచూకీ కోసం అవనిగడ్డ తదితర ఏరియాల్లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేని రాఘవులు శుక్రవారం, శనివారం నగరం అంతా పిల్లల కోసం గాలించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాఘవులు తన పిల్లలు కనిపించటంలేదంటూ శనివారం రాత్రి ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి ముగ్గురు పిల్లల కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పిల్లల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment