ట్రాఫిక్ టెన్షన్
రద్దీలో డ్రైవింగ్‌తో సమస్యలు
రద్దీ వేళల్లో ప్రయాణంతో కాలుష్య ప్రభావానికి గురవుతుంటారు. రక్తం చిక్కపడి బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. చికాకు, పనిపై దృష్టి పెట్టలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వెన్నెముక సమస్యలకు దారి తీయొచ్చు.
– డాక్టర్ దుర్గాప్రసాద్,
జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు
యాంగ్జైటీకి గురవుతారు
రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తే కొందరు యాంగ్జైటీకి గురవుతారు. చికాకుతో రాష్ డైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధ పడుతున్నవారు ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించడం మేలు. వాహనచోదకులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
– డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ఏ రోడ్డుకెళ్లినా ట్రాఫిక్ గందరగోళమే. బండి తీసుకుని రోడ్డెక్కితే వాహనచోదకులు ట్రాఫిక్ ‘టెన్షన్’తో సతమతమవుతున్నారు. వాహన ధ్వనులు, అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఆ ట్రాఫిక్‌లో వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ నెలకొంటోంది. నిత్యం రద్దీలో ప్రయాణించే వారు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల స్కూల్ సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే టెన్షన్, డ్యూటీకి వెళ్లేటప్పుడు సమయానికి వెళ్లలేననే ఆందోళనతో అనేకమంది సతమతమవుతున్నారు.
ఇవే నిదర్శనం
● పోరంకికి చెందిన వెంకటేష్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతోంది. అసలే ఆఫీసులో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ అమలులో ఉంది. పది నిమిషాలు ఆలస్యమైతే, మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేస్తుండటంతో అతనికి తీవ్రమైన టెన్షన్ నెలకొంటోంది.
● లబ్బీపేటకు చెందిన ఓ ఉద్యోగి గన్నవరంలో పని చేస్తుంటాడు. కుమార్తెను బెంజిసర్కిల్ వద్ద కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్తుంటాడు. ఇలా రోజూ కళాశాలకు, కార్యాలయానికి సమయానికి వెళ్లలేమనే టెన్షన్‌కు గురవుతూ, హైపర్‌టెన్షన్ బారిన పడ్డారు. వీరిద్దరే కాదు. అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఏం చేయాలంటే..
● మనం వెళ్లాలనుకునే చోటుకు కాస్త ముందు బయలు దేరాలి. అప్పుడు ట్రాఫిక్ ఉన్నా ఆందోళన చెందక్కర్లేదు
● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే రద్దీ సమస్య తగ్గుతుంది
● యోగా, మెడిటేషన్ చేయాలి
● పొల్యూషన్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి
వైద్యులు గుర్తించిన సమస్యలివే
● ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు యాంగ్జైటికీ గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడిబారిన పడుతున్నారు.
● యాంగ్జైటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు.
● నిత్యం రద్దీలో డ్రైవింగ్ చేసే వారిలో పొల్యూషన్ కారణంగా రక్తం చిక్కపడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు.
● చిన్న వయస్సులోనే హైపర్‌టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది.
● ట్రాఫిక్‌లో ప్రయాణంతో నిద్ర సమస్యలు వస్తున్నాయి.
● ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారిలో స్పైన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
● ట్రాఫిక్ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది.
రద్దీ రోడ్లపై ప్రయాణంతో మానసిక, శారీరక సమస్యలు రక్తపోటు అధికమవుతుందంటున్న వైద్యులు నిద్ర సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్‌కు దారితీయొచ్చు
Comments
Please login to add a commentAdd a comment