ఉత్తమ ఫలితాలు సాధించాలి
జి.కొండూరు: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సమయాన్ని వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర పదో తరగతి ప్రభుత్వ విభాగాధిపతి బి.దేవానందరెడ్డి కోరారు. చెవుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ప్రభుత్వ పాఠశాలల విజయభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లుగా పదో తరగతి విద్యార్థులు మండలంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మానించారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉచిత మెగా డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ మార్పు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉచిత మెగా ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ మార్పు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి(ఎఫ్‌ఏసీ) కె.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరగాల్సిన స్క్రీనింగ్ టెస్ట్‌ను 10వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తేదీ మార్పుకు సంబంధించి అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపిస్తామని తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నాగులచవితి మహోత్సవాలు ప్రారంభం
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నాగుల చవితి మహోత్సవాలు శనివారం వేద మంత్రాల నడుమ వైభవంగా ప్రారంభించారు. ఆలయ డీసీ డీఎస్‌ఆర్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు బుద్దు పవన్ కుమార్‌శర్మ బ్రహ్మత్వంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తిక మాస దీక్ష అభిషేకాలు గర్భాలయంలో శ్రీ స్వామివారికి భక్తుల గోత్రనామాలతో పరోక్షంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి శాంతి కల్యాణంలో పాల్గొన్నారు.
జాబ్ మేళాలో
9 మందికి ఉద్యోగాలు
కురుమద్దాలి(పామర్రు): కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాలో తొమ్మిది మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ–సీడాఫ్ వారిసంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహించారు. 25 మంది ఇంటర్వ్యూకు హాజరవ్వగా వీరిలో 9 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ సంస్థ సిబ్బంది టి.గుణరంజన్, వై.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన
గరికపాడు(జగ్గయ్యపేట): రైతులకు వ్యవసాయంలో నూతన పద్ధతులపై అవగాహన కలిగించాలని జిల్లా వ్యవసాయాధికారి నాగమణెమ్మ పేర్కొన్నారు. గ్రామంలోని కేవీకేలో నవంబరు నెలకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులపై కొన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన లేదన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే పంటలపై అవగాహన కలిగించాలని చెప్పారు. పంటల్లో ఎరువుల వినియోగాన్ని తెలపాలని చెప్పారు. రైతులకు వ్యవసాయాధికారులు అందు బాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం కేవీకేలోని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏలు, ఏవోలు, ఉద్యానశాఖాధికారులు, కేవీకే అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment