ఉద్రిక్తతల మధ్య ఆక్రమణల తొలగింపు
పెడన: పట్టణంలో రైల్వే స్థలాల్లోని ఆక్రమణలను శనివారం తొలగించారు. విజయవాడ, గుడివాడ, భీమవరం సెక్షన్లకు చెందిన రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిబ్బంది సహకారంతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), జీఆర్పీ(గవర్నమెంటు రైల్వే పోలీస్) సిబ్బందితో పాటు రైల్వే ఫోర్‌మెన్‌లతో వస్తువులను బయటకు చేరవేసి ఇళ్లలో ఎవరూ లేకుండా చూసి విద్యుత్ వైర్లను, కనెక్షన్‌లను తప్పించి పొక్లెయిన్లతో పడవేశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు శంకర్ రామాజంనేయులు, నాగేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 8 నెలలు క్రితం నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆర్నెలల క్రితం రెండో నోటీసు కూడా ఇచ్చామని, ఖాళీ చేయాలని మూడు రోజుల క్రితం కూడా తెలిపారన్నారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సహాకారంతో వీటిని జారీ చేయడమే కాకుండా కౌన్సిలింగ్ ఇప్పించామన్నారు.
34 కుటుంబాలు..
రైల్వే లైను పక్కనే వివిధ ప్రాంతాల్లో, 18వ వార్డు ఇందిరాకాలనీలో 34 కుటుంబాలున్నాయి. వీరిని ఖాళీ చేయించారు. ఇప్పటికే వీరందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఒకరిద్దరుంటే వారికి కూడా పరిశీలించి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఇన్‌చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్ తెలిపారు. పెడన, మచిలీపట్నం రైల్వేగేట్ సమీపంలోని క్యాబిన్ వెనుక ఇంటిని కూల్చడానికి అధికారులు వెళ్లడంతో కుటుంబసభ్యులు పొక్లెయిన్‌కు ఎదురుగా బైఠాయించారు. వారి వద్ద ఉన్న ఆధారాలు చూపించి, కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. అయినా వారు చెప్పేది వినకుండా రైల్వే అధికారులు కోర్టులోనే తేల్చుకుంటామంటూ ఇంటిని పడేశారు. పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు ఎస్‌ఐలతో పాటు గుడివాడ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను రప్పించి ఖాళీ చేయించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావు, టీపీవో సుజనాకుమారి, ఇన్‌చార్జి ఆర్‌ఐ విజయ లక్ష్మి, వీఆర్వోలు, టౌన్ ప్లానింగ్ కార్యదర్శులున్నారు.
రైల్వే స్థలాల్లో ఆక్రమణలు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో.. ఖాళీ చేయిస్తున్న రైల్వే అధికారులు పొక్ల్లెయిన్ ఎదుట కుటుంబం బైఠాయింపు
Comments
Please login to add a commentAdd a comment