పోరంకిలో కారు బీభత్సం
కారు డ్రైవర్‌తో సహా ఇద్దరు ద్విచక్ర వాహనచోదకులకు గాయాలు
పెనమలూరు: పోరంకిలో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన రోహిత్‌జమాధార్ విజయవాడ భవానీపురంలో శుభకార్యానికి వచ్చాడు. అతను ఆదివారం తెల్లవారుజామున కారులో పెనమలూరు వైపు వెళ్తున్నాడు. అప్పుడు పోరంకి శివాలయం వద్ద కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఘటనలో ఎదురుగా బైక్‌పై వెళ్తున్న శ్రీను, రంగారావు కారు ఢీకొట్టింది. పండ్ల దుకాణాలపై కారు దూసుకు వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆగింది. విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు, కారు నడుపుతున్న రోహిత్‌జమాధార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఘటన ఉదయం జరిగి ఉంటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
నందిగామ టౌన్: పొలానికి పిచికారీ చేసేందుకు తీసుకువచ్చిన పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన బండ్లమూడి శివ (46) వ్యవసాయం చేస్తుంటారు. తనకున్న 15 ఎకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర నష్టాలను చవి చూశాడు. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై శివ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
విధి నిర్వహణలో పీహెచ్‌సీ స్టాఫ్‌నర్స్ మృతి
నాగాయలంక: గ్రామంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌నర్స్ (ఎన్‌హెచ్‌ఎం)గా చేస్తున్న పులివర్తి కల్యాణి (34) విధి నిర్వహణలోనే మృతి చెందిన సమాచారం ఆలస్యంగా తెలిసింది. వైద్యాధికారి డాక్టర్ కె.శివరామకృష్ణ తెలిపిన సమాచారం మేరకు స్థానిక పీహెచ్‌సీలో 2021 నుంచి స్టాఫ్‌నర్స్‌గా బాపట్ల జిల్లాకు చెందిన కల్యాణి పని చేస్తున్నారు. ఆమె ఏడాదిగా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతూ సెలవులో ఉన్నారు. డయాలసిస్ తర్వాత కోలుకున్న ఆమె నెల రోజుల నుంచి ఆస్పత్రి విధులకు వస్తున్నారు. ఈ క్రమంలో నవంబరు 1వ తేదీ రాత్రి షిఫ్ట్ డ్యూటీ చేస్తూ 11గంటల సమయంలో కుప్పకూలి పడిపోయారు. పీహెచ్‌సీ డాక్టర్ ఇంద్రకుమార్‌రెడ్డి, సిబ్బంది ఆమెను మెరుగైన చికిత్స కోసం అవనిగడ్డ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment