పటిష్టంగా ఉచిత ఇసుక పాలసీ
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి (మచిలీపట్నం):ఉచిత ఇసుక పాలసీని పటిష్టవంతంగా అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్‌లలో మిషనరీ, భారీ వాహనాలు అనుమతించకుండా చూడాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టాలని,
ఇందుకోసం ఇసుక రీచ్‌ల ప్రవేశ మార్గాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, ప్రతి రీచ్‌కు ఇన్‌చార్జ్ అధికారులను నియమించాలని కోరారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఇసుక రీచ్‌ల తనిఖీలు నిర్వహించి, ఉచిత ఇసుక సరఫరా సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ నిబంధనలు, నదీ పరిరక్షణ చట్టం, వాల్టా చట్టం నిబంధనలు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించేలా టెక్నికల్ బృందాలు ిపీరియాడికల్ తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. బందరు పోర్టు అభివృద్ధి పనులకు, ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులకు, ఉపాధి హామీ పనులకు ఇసుక సరఫరా కోసం జిల్లాలో రెండు రీచ్ లు కేటాయించినట్లు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, కమిటీ వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ, ఏఎస్పీ వీవీ నాయుడు, గనుల శాఖ ఉపసంచాలకులు కె. శ్రీనివాస్ కుమార్, భూగర్భ జల ఉపసంచాలకులు డి. విజయవర్ధన్ రావు, ఇరిగేషన్ ఈఈ రవి కిరణ్, రవాణా శాఖ ఎంవీఐ సిద్ధిక్, పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంకే మీనా జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లాలోని వినియోగం, ఇతర అంశాలు కలెక్టర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment