గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం
చిలకలపూడి (మచిలీపట్నం):గిరిజన సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన అమరవీరులను స్మరించుకొని జన జాతీయ గౌరవ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా అమరవీరుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపారు. గిరిజనులు స్వాభిమాన గౌరవంతో వేరొకరి సొమ్ముకు ఆశపడకుండా జీవించే వారని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సాంఘికంగా, మహిళా సాధికారతలో ఎంతో ముందు ఉంటారన్నారు. విద్య లేకపోవడం, సరైన అవగాహన లేక కనీసం ఆధార్ కూడా పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ అంశంపై దృష్టి సారించి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి గిరిజనులకు ఆధార్ నమోదుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. స్వాతంత్ర పోరాటంలో గిరిజన అమరవీరుడు బిర్సా ముండా స్ఫూర్తిని నింపేందుకు దేశవ్యాప్తం ఆయన జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సుకర్లబాదలో నిర్మిస్తున్న గిరిజన కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని గిరిజన
సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఫణి ధూర్జటి, గిరిజన
సంఘం నాయకులు వెంకటేశ్వరరావు పాల్గొని గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment