దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు, ఉభయదాతలతో పాటు నూతన వధూవరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆది దంపతులకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమంలో ఉభయ దాతలు పాల్గొన్నారు.
కిటకిటలాడిన క్యూలైన్లు..
పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సర్వ దర్శనంతో పాటు టికెట్ల క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మరో వైపున ఘాట్‌రోడ్డు మీదుగా వచ్చిన భక్తులతో క్యూలైన్లు ఓం టర్నింగ్ వరకు చేరాయి. మహా మండపం మీదుగా వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే అనుమతించారు. అక్కడి నుంచి భక్తులు తిరిగి మెట్ల మార్గం ద్వారా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో అఖండ ధ్యాన యజ్ఞాన్ని నిర్వహించారు. ధ్యాన యజ్ఞాన్ని ఆలయ ఈవో కేఎస్ రామరావు ప్రారంభించి, భక్తులతో కలిసి ధ్యానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment