బీచ్‌లో పర్యాటకుల సందడి
వసతులు లేక తీవ్ర ఇబ్బందులు
కోడూరు: హంసలదీవి బీచ్ పర్యాటకులతో సందడిగా మారింది. కార్తికమాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు పెద్దసంఖ్యలో సాగరతీరానికి తరలివచ్చారు. హైదరాబాద్, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు తీరంలో సందడి చేశారు. యువత తీరం ఒడ్డున వివిధ రకాల ఆటలాడుతూ సరదాగా గడిపారు. చిన్నారులు ఇసుకతిన్నెలపై తమ పేర్లు రాసుకుంటూ, బొమ్మలు గీస్తూ మురిసిపోయారు. పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి, కోడూరు ఎస్‌ఐ చాణక్య సిబ్బందితో కలిసి తీరం వెంట గస్తీ నిర్వహించారు.
కానరాని వసతులు..
ఆదివారం ఒక్కరోజు సుమారు పది వేలకు పైగా యాత్రికులు హంసలదీవి బీచ్‌కు వచ్చారు. అయితే తీరంలో కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులను కూడా తీరానికి రానివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకోవడంతో పర్యాటకుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మహిళలు కార్తికస్నానాల అనంతరం దుస్తులు మార్చుకునేందుకు గదులు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రం తాళాలను కూడా అటవీ అధికారులు తెరవలేదు.
Comments
Please login to add a commentAdd a comment