వనసమారాధనలతో ఐకమత్యం పెంపు
నున్న(విజయవాడరూరల్): కార్తిక వనసమారాధనలతో ఐకమత్యం పెరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వి.ఆర్.కె.కృపాసాగర్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్తిక వన సమారాధనలో జస్టిస్ కృపాసాగర్ పాల్గొన్నారు. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. న్యాయవాదుల కుటుంబాల సభ్యులు అందరూ ఒకే చోట కలుసుకునేలా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన నిర్వహించడం సంతోషమన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా శాంతి కల్యాణం
పెనమలూరు:యనమలకుదురులోని పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో మహా రుద్రహోమం చేశారు. అనంతరం మహా శాంతిహోమం జరిగింది. మూల విగ్రహాలకు అష్ట బంధ సమర్పణ అనంతరం ఆలయంలో శాంతి కల్యాణం చేశారు. ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. ఆలయంలో సోమవారం అష్టబంధన మహా కుంభాభిషేకం ఉదయం 8.30 గంటలకు శ్రీవిధుశేఖర భారతీ సన్నిధానం అమృత హస్తాలతో ఘనంగా చేస్తారని ఆలయ ఈఓ ఎన్.భవాని తెలిపారు.
స్వామివారికి వెండి
నాగపడగ సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు గొడిశీల కల్యాణ్ శేఖర్ స్వామివారికి వెండి నాగ పడగను సమర్పించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఒక కిలో బరువున్న వెండి నాగపడగను ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అధికారులు బర్మా ప్రసాద్, కిషోర్, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు బంగారు కాసుల పేరు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. గొల్లపూడికి చెందిన ఎ.సూరిబాబు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 65 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు కాసుల పేరును అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు, వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. దాతలకు ఆలయ అధికారి రమేష్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
అలరించిన కూచిపూడి నృత్యాంశాలు
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రం కూచిపూడిలో ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన పార్వతీ కల్యాణం హరికథాగానం, డాక్టర్ వేదాంతం రాధేశ్యాం శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యంశాలు భక్తి భావాన్ని పెంపొందించాయి. టీటీడీ సహకారంతో కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఇంటి వద్ద నాట్య శిల్పారామకళా వేదికపై ప్రదర్శనలు వైభవంగా సాగాయి. రాజమండ్రికి చెందిన పురాణం విజయలక్ష్మి భాగవతార్ హరికధాగానానికి వయోలిన్‌పై పాణ్యం దక్షిణామూర్తి, మృదంగంపై మెహర్ సహకరించారు. రాధేశ్యాం శిష్య బృందం గుడివాడ, నెల్లూరు విద్యార్థినులు హన్విక సాయి, టి.గీతాకృష్ణ, హర్షకృష్ణ , తపశ్య శ్రీ షణ్ముఖప్రియ చక్కని హావ భావాలతో నృత్య ప్రదర్శన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment