నత్తనడకన పీఎం సూర్య పథకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకొనే లక్ష్యంతో చేపట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(సౌరవిద్యుత్) పథకం అమలు ఎన్టీఆర్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలో తొలిదశలో 20వేల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంకాగా, ప్రస్తుతం కేవలం 400 కనెక్షన్లు మాత్రమే ఇన్‌స్టాల్ చేయడం ఇందుకు నిదర్శనం. పట్టణాల్లోనే తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ పథకంపై ఆసక్తిచూపడం లేదు. ప్రజలకు ఈపథకంపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలంకావడం, బ్యాంకుల సహకారం కొరవడటం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందేనా అన్న సందేహం కలుగుతోంది.
రాయితీపై సోలార్ రూప్‌టాప్ ప్యానల్స్..
పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల సమర్థంగా వినియోగించుకొనే లక్ష్యంతో
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం(సౌర విద్యుత్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వ్యక్తిగత గృహసముదాయాలకు రాయితీపై సోలార్ రూప్‌టాప్ ప్యానల్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. విద్యుత్ వినియోగం ఆధారంగా 150 యూనిట్లులోపు వినియోగం ఉన్నవారికి 1నుంచి 2 కిలో వాట్ ప్యానల్స్, 150–300 యూనిట్లు వినియోగించే ఇళ్లకు 2 నుంచి 3 కిలో వాట్ కెపాసిటీ ప్యానల్స్, 300 యూనిట్ల పైబడి విద్యుత్‌ను వినియోగించేవారికి 3కిలోవాట్ సామర్థ్యం కలిగిన రూప్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్‌స్టాల్ చేస్తారు.
లబ్ధిదారులకు బ్యాంక్ రుణం
రూ.2 లక్షల విలువైన 3కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం రూ.78వేల రాయితీ కల్పించింది. రూ.20వేలు లబ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని ఏడు శాతం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ.32 వేలు ఆదా అవుతోంది. గృహ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన సౌరవిద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ.2.09 ఆదాయం పొందవచ్చు. రుణాన్ని పొందేందుకు బ్యాంకులకు సెక్యూరిటీ కింద ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఆదర్శ సౌరగ్రామాల గుర్తింపు
పీఎం సూర్య పథకం కింద జిల్లాలోని బూదవాడ (జగ్గయ్యపేట), వెల్వడం (మైలవరం), పరిటాల (కంచికచర్ల), కంభంపాడు (ఎ.కొండూరు), షేర్ మహమ్మద్‌పేట (జగ్గయ్యపేట) గ్రామాలను ఆదర్శ సౌర గ్రామాలుగా గుర్తించారు. వీటిలో నూరుశాతం లక్ష్యాలు చేరుకున్న గ్రామాలకు రూ.కోటి కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం అంద జేయనుంది.
స్పందన కరువు...
ఫిబ్రవరిలో పథకం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కేవలంలో 400సోలార్ ప్యానల్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేశారు. ఇందులో కూడా పట్టణాల్లోనే అధికసంఖ్యలో ఇన్‌స్టాల్ చేయడం గమనార్హం. విద్యుత్ బిల్లుల బెడద తప్పడమే కాకుండా అవసరాలు తీరాక సౌరవిద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకొని ఆదాయం పొందే అవకాశం ఈ పథకంలో ఉంది. అయినప్పటీ ఈ పథకంపై ప్రజలు ఆసక్తికనబరచడం లేదు.
డీఆర్‌సీలో ప్రస్తావనతో కదలిక...
గత నవంబర్ 30వతేదీన జరిగిన డీఆర్‌సీ సమావేశంలో జిల్లాలో పథకం అమలు తీరుపై ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ప్రస్తావించారు. పీఎం సూర్య పథకం కింద ఉద్యోగులు తొలుత ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా సామాన్యులకు ఆదర్శంగా నిలవాలని ఎంపీ కోరారు. మార్చితో తొలిదశ ముగుస్తుందని, రాయితీ కోల్పోయే అవకాశం ఉందని చెప్పడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.
పథకంపై సమీక్ష సమావేశాలు...
ఈ పథకంలో జిల్లాను నంబర్‌వన్ స్థానంలో నిలపాలంటూ జిల్లా కలెక్టర్ సమయం దొరికినప్పుడల్లా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు సద్వినియోగం చేసుకునేలా అవకాశం కల్పించారు. అయినప్పటికీ పథకానికి రిజిస్ట్రేషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడం గమనార్హం.
ష్యూరిటీ అడుగుతున్న బ్యాంకులు..
బ్యాంకురుణం ప్రశ్నార్థకంగా మారింది. పథకానికి రాయితీపోను మిగిలిన మొత్తం బ్యాంకు రుణం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. జీరో డాక్యుమెంటేషన్‌తో బ్యాంకులు లబ్ధిదారులకు రుణం మంజూరు చేయాలి. కానీ బ్యాంకర్లు ష్యూరిటీ కోరడంతో పెద్దగా ఆసక్తిచూపడం లేదు.
మార్చి నాటికి లక్ష్యం 20వేల కనెక్షన్లు ఇప్పటికి కేవలం 400 మాత్రమే పూర్తి పల్లెల్లో స్పందన కరువు ముందుకు రాని ఉద్యోగులు
లక్ష్యం పూర్తిచేస్తాం..
పీఎం సూర్య పథకంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విద్యుత్‌బిల్లుల బెడద ఉండదు. పైగా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకొని ఆదాయం పొందవచ్చు. ఈ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గృహ సముదాయాలు, ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నాం. తప్పకుండా నిర్దేశిత గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం.
– భాస్కరరావు, నోడల్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment