ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జన ఔషధి కేంద్రం
● నేడు ప్రారంభం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ప్రధాన కార్యాలయంలో జన ఔషధి కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాన్ని శనివారం డీసీఎంఎస్ చైర్‌పర్సన్ సీహెచ్ శిరోమణి మద్దయ్య, జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో 1,759 రకాల జనరిక్ మందులు, 280 రకాల సర్జికల్ పరికరాలు లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మందుల ధరలతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో జ్వరం, డయాబెటీస్, బీపీ, గ్యాస్, థైరాయిడ్.. ఇలా అన్ని రకాల వ్యాధులకు తక్కువ ధరకే జనరిక్ మందులు లభించనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లోనూ జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ముగ్గురికి కరోనా పాజిటివ్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎఫ్‌ఎంసీ, మెడికల్ ఓపీలలో 53 మందికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఇందులో బాలాజినగర్, కల్లూరు, బుధవారపేటలకు చెందిన వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
అడిషనల్ ఎస్పీగా నాగరాజు
● సర్కార్ హెడ్ క్వార్టర్‌కు బదిలీ
కర్నూలు: జిల్లా పోలీసు శాఖ పరిపాలన విభాగం అడిషనల్ ఎస్పీగా(అడ్మిన్) నల్లమరి నాగరాజు నియమితులయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేస్తున్న ఈయనకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించి కర్నూలు జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణానికి చెందిన నాగరాజు 1989లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. ఎక్కువ కాలం కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2000లో సీఐగా పదోన్నతి పొంది కడప, ప్రకాశం జిల్లాల్లో పనిచేశారు. 2009లో నంద్యాల టూటౌన్ సీఐగా నాలుగు మాసాల పాటు సేవలందించారు. 2011లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ హైదరాబాద్, తాడిపత్రి, ఏసీబీ కడప, ప్రకాశం జిల్లా దర్శిలో పనిచేశారు. ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి పదోన్నతిపై కర్నూలు అడిషనల్ ఎస్పీగా బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సర్కార్‌ను హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment