ప్రధాని సభకు అధికారుల హడావుడి
● తూతూమంత్రంగా బిర్సా ముండా జయంతి ● తీవ్ర నిరసన తెలిపిన గిరిజన సంఘాలు
ఆత్మకూరురూరల్: మండలంలోని కొట్టాల చెర్వు చెంచు గూడెంలో శుక్రవారం బిర్సా ముండా జయంతిని చెంచులు లేకుండానే తూతూమంత్రంగా నిర్వహించారు. జన్ జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జామై నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా పాల్గొని దర్తి ఆబజాతీయ గ్రామ ఉత్కర్ష్‌అభియాన్ పథకం కింద దేశంలోని ఆదిమ గిరిజనుల కోసం రూ.6,900 కోట్లతో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ పథకం కింద 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన గూడేనికి విద్యుత్, రోడ్డు, సురక్షిత తాగునీరు, పక్కాగృహాలు తదితర అంశాలలో సంతృప్త పద్ధతిలో పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కాగా కార్యక్రమానికి శ్రీశైలం ఐటీడీఏ పీఓ శివప్రసాద్, ఆర్‌డీఓ నాగజ్యోతి, తహసీల్దార్‌లు రత్నరాధిక, దేవి, ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ గుండాలనాయక్ పాల్గొన్నారు.
చెంచులకు స్థానం ఏదీ?
49 చెంచు గూడేలున్న జిల్లాలో సభకు చెంచులను రప్పించడంలో ఐటీడీఏ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అందుకే సభలో గ్రామంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థులు, సభనిర్వహణ కోసం వచ్చిన ఐటీడీఏ ఉపాధ్యాయులు, ఉద్యోగులతో సమావేశ స్థలిని నింపివేశారు. కొట్టాల చెర్వుకు చెందిన కొందరు చెంచులు మాత్రమే సభలో పాల్గొన్నారు. ఇందిరేశ్వరం, కొత్తపల్లెకు చెందిన ఓ ఐదు మంది చెంచులు ఉన్నప్పటికీ వారేవో సమస్యల పరిష్కారం కోసం మాత్రమే వచ్చారు. చెంచు గిరిజనుల సమస్యలు చర్చించకుండా కేవలం ప్రధాని ప్ర సంగంతో సభను ముగించడం సరికాదని గిరిజ న సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
చెంచు సర్పంచ్‌కు దక్కని ప్రొటోకాల్
ఇదే చెంచుల సభలో అదే వర్గానికి చెందిన మహిళా సర్పంచ్‌కు ప్రొటోకాల్ దక్కలేదు. కొట్టాల చెర్వు చెంచుగూడేం సర్పంచ్ నాగలక్ష్మి ప్రారంభంలోనే మొదటి వరసలో కూర్చుంది. కాసేపటికి ఆర్‌డీఓ, హౌసింగ్ పీడీ తదితర మొదటిశ్రేణి అధికారులు రావడంతో ఆమె రెండో వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. అంతలో తహసీల్దార్ రావడంతో సర్పంచ్ లేవాల్సి వచ్చింది. ఈ సారి ఆమెకు కుర్చీ లేకపోవడంతో నిల్చొనే కార్యక్రమాన్ని తిలకించింది.
Comments
Please login to add a commentAdd a comment