● అధికారులను హెచ్చరించిన మాజీ మంత్రి బుగ్గన
డోన్: కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడితే రానున్న రోజుల్లో దండన ఎదుర్కోక తప్పదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. డోన్‌లోని తన స్వగృహంలో బుగ్గన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతుకలను పోలీసుల సహకారంతో కూటమి నేతలు అమానుషంగా నొక్కివేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని ఓ వర్గం పనిచేస్తోందన్నారు. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు ఫిర్యాదులిచ్చే నాయకులకు, కేసులు కట్టే అధికారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు. పాలకులకు తొత్తులుగా వ్యవహరించే అధికారులను వదలబోమన్నారు. ప్రజా మద్దతుతో తప్పక తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు ఆ అధికారులు సప్తసముద్రాల అవల ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దమనకాండ సాగిస్తున్న కూటమి నాయకులు కూడా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment