పెన్షనర్ల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటాం
● జాతీయ పెన్షనర్ల దినోత్సవంలో జిల్లా ట్రెజరీ డీడీ రామచంద్రరావు
కర్నూలు (అగ్రికల్చర్): పెన్షనర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని మంగళవారం అబ్బాస్‌నగర్‌లోని పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి ఆధ్వర్యంలో, కృష్ణానగర్‌లో రిటైర్డ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ సొసైటీలో జె.విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో, కర్నూలు లయన్స్ క్లబ్‌లో రిటైర్డ్ తహసీల్దారు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం ఏర్పడటానికి న్యాయ పోరాటం చేసిన ధరమ్ స్వరూప్ నకారా, సుప్రీమ్‌కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వైవీ చంద్రచూడ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వయోవృద్ధులకు చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. 75 ఏళ్లు నిండిన పెన్షనర్లను సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో పాల్గొన్న జిల్లా ట్రెజరీ డీడీ రామచంద్రరావు మాట్లాడుతూ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు లైఫ్ సర్టిఫికెట్లు ట్రెజరీలకు సమర్పించేలా అవగాహన కల్పించాలని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలను కోరారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా ట్రెజరీ డీడీ రామచంద్రరావు, ఏటీఓ జయలక్ష్మి, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ అధికారి రఘువీర్‌లను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో పెన్షనర్ల సంఘం ప్రతినిధులు సుబ్బారావు, మహబూబ్‌బాషా, నాగశేషుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment