అడ్డు తొలగించుకునేందుకే హత్యాయత్నం
గోనెగండ్ల: రెండు రోజుల క్రితం గాజులదిన్నె ప్రాజెక్టు సమీపం ఎల్లెల్సీ కాలువ వద్ద వడ్డె అరవిందస్వామిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రియురాలు బుట్టా ప్రియాంక, మరో నాలుగురిని పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ గంగాధర్ వెల్లడించారు. ఎమ్మిగనూరుకు చెందిన వడ్డె అరవింద స్వామి, బుట్టా ప్రియాంక ప్రేమించుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉన్నారు. ప్రియాంక ప్రస్తుతం ఎర్రకోట ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో చదివే ఈడిగ భరత్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. అతని సాయంతో అరవింద స్వామిని చంపాలని పథకం వేసింది. గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్లెల్సీ వద్దకు వెళ్లి రెక్కీ కూడా నిర్వహించింది. అనుకున్న ప్రకారం మంగళవారం ఉదయం ప్రియాంక, అరవింద స్వామిని ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చి భరత్‌కు సమాచారం ఇచ్చింది. భరత్ దేవబెట్ట గ్రామానికి చెందిన తన స్నేహితులు వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్‌కుమార్, కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులుతో కలిసి వెళ్లి అరవింద స్వామిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు కేకలు వేయడంతో సమీప పొలంలో ఉన్న రైతులు దాడి అడ్డుకుని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం సాయంత్రం బి.అగ్రహారం గ్రామం మల్లెల వాగు వంక వద్ద ప్రియాంక, భరత్, కుమారస్వామి, ప్రశాంత్‌కుమార్, రామాంజనేయులు దాక్కున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి నిందితులను అరెస్టు చేసి ఐదు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన వేట కొడవలి, పల్సర్ బైక్, హోండా ఆక్టివా మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు. ఈడిగ భరత్, ప్రియాంక బీటెక్ సీఈసీ మూడో సంవత్సరం, ఎరుకలి రామాంజనేయులు, వడ్ల కుమారస్వామి అదే కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నారు. గంధాల ప్రశాంత్‌కుమార్ పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం నాపరాతి పనిచేస్తున్నాడు.
ప్రియురాలితో పాటు
మరో నలుగురి అరెస్ట్
దాడికి పాల్పడిన వారంతా
ఇంజినీరింగ్ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment