‘పది’ విద్యార్థుల ఉత్తీర్ణత బాధ్యత ఉపాధ్యాయులదే
కర్నూలు(సెంట్రల్): పదో తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత అయ్యేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా ఆదేశించారు. ఉపాధ్యాయులకు మెడికల్ ఎమర్జెన్సీ తప్పా ఇతర సందర్భాల్లో దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేయరాదని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం పెంపుపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ అధికారులు, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముందుగా గతేడాది తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న మండలాల ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. అందుకు కారణాలు.. ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఫలితాలు నమోదు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా బీ, సీ గ్రేడు విద్యార్థులపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు సూచన చేశారు. ఇప్పటి నుంచైనా విద్యార్థులు చదువుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్లను ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాలలను పర్యవేక్షణ చేసి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. 15 రోజుల్లో విద్యార్థులకు వర్చువల్ తరగతులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. అనంతరం పదో తరగతి పరీక్షలకు సంబంధించిన కార్యాచరణను కలెక్టర్ ఆవిష్కరించారు.
15 రోజుల్లో అందుబాటులోకి
వర్చువల్ తరగతులు
కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment