హత్యకేసులో నిందితుడి అరెస్ట్
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం చెంచుగూడెం సమీపంలో గొర్రెలను నిలిపిఉన్న షేక్ అష్రత్ వలీ (32)ని గొడ్డలితో నరికి చంపాడని భావిస్తున్న నిందితుడు షేక్ షఫీని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుపై గురువారం ఆత్మకూరు అర్బన్ పీఎస్‌లో సీఐ రాము వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న ఇందిరేశ్వరం చెంచుగూడెం సమీపంలో గొర్రెల మందలను నిలుపుకుని ఉన్న హర్షత్ వలీ, షేక్ షఫీ మధ్య గొర్రెలను మేపే విషయంలో ఘర్షణ ఏర్పడింది. అర్షత్ వలీ మండుతున్న కర్రతో షఫీ వీపుపై కొట్టాడు. ఆగ్రహించిన షఫీ చేతిలో ఉన్న గొడ్డలితో హర్షత్ వలీ తలపై నరకడంతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. భయభ్రాంతులకు గురైన షఫీ అక్కడినుంచి పారిపోయాడు. అక్కడున్న మరో కాపరి రాజ్‌కుమార్ గాయపడిన హర్షత్ వలీని ఆటోలో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య షేక్ నసిమూన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాము కేసు నమోదు చేశారు. నిందితుడు షఫీ స్థానిక నంద్యాల టర్నింగ్ వద్ద ఉన్నాడన్న సమాచారం మేరకు అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరుపరచగా జడ్జి 15 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐలు నారాయణ రెడ్డి, హుసేన్ బాషా, ఏఎస్‌ఐ శంకరరెడ్డి, సంజీవుడు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment