ఆయుర్వేదానికి నకిలీ చేటు | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదానికి నకిలీ చేటు

Published Fri, Dec 20 2024 1:35 AM | Last Updated on Fri, Dec 20 2024 1:35 AM

ఆయుర్వేదానికి నకిలీ చేటు

ఆయుర్వేదానికి నకిలీ చేటు

నాటు వైద్యంతో

ప్రజల ప్రాణాలకు ముప్పు

ఆకు పసర్లు, వాతలతోనూ వైద్యం

నకిలీ మందులతో దెబ్బతింటున్న

అవయవాలు

పట్టించుకునే అధికారులు కరువు

ఎన్నో దీర్ఘకాలిక, మొండి వ్యాధులను ఆయుర్వేదం తగ్గిస్తుందన్నది ప్రజల్లో ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అక్రమ మార్గాల్లో పయనిస్తున్నారు. రోగికి త్వరగా ఫలితం రావాలని చెప్పి ఆయుర్వేద పొడుల్లో అల్లోపతి మందులు కలిపి మాత్రల రూపంలో తయారు చేసి రోగులకు అంటగడుతున్నారు. వాటిని మింగిన రోగులకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం పాడై ఆసుపత్రి పాలవుతున్నారు. వైద్యులను సంప్రదించకుండా నేరుగా మందుల దుకాణాలు, రోడ్డుపై విక్రయించే వారి వద్ద నాటు మందులు కొనుగోలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల్లో నాటు వైద్యులు అధికమయ్యారు. వారు చేసేది నకిలీ వైద్యం. కానీ ప్రసార, సామాజిక మాద్యమాల్లో పలురకాల వ్యాధులకు నమ్మకమైన, మెరుగైన వైద్యం అందిస్తామని, అల్లోపతిలో తగ్గని వ్యాధులు తగ్గిస్తామని, దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు కొందరు పట్టణాల్లోని లాడ్జిల్లో, మరికొందరు అపార్ట్‌మెంట్‌లు, అద్దె ఇళ్లల్లో, ఇంకొందరు రోడ్డు పక్కనే వ్యాపారం చేస్తున్నారు. ప్రధానంగా సంతలు, మార్కెట్ల వద్ద ఇలాంటి వారి హడావుడి అధికంగా ఉంటోంది. కర్నూలు వంటి నగరాల్లో అయితే నడిరోడ్డుపైనే వందలాది రకాల మందులను రోడ్డుపై పోసి మొండి వ్యాధులను సైతం తగ్గిస్తామని ప్రకటనలు చేస్తూ వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వారి వద్దకు మొలలు, ఫిస్టులా, ఫిషర్‌, వరిబీజం, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, సుఖవ్యాధులు, శృంగార సమస్యలు, ఎయిడ్స్‌, కామెర్లు, పక్షవాతం వంటి వ్యాధులకు గురైన వారు ఆకర్షితులవుతున్నారు. రోడ్డుపైనే బాహాటంగా మందులు విక్రయిస్తున్నా ఇదేమిటని ఏ ఒక్క అధికారి కూడా వారిని ప్రశ్నించడం లేదు. ఆయుర్వేదం పట్ల రోగులకు ఉన్న నమ్మకం, వారి బలహీనతను ఆసరా చేసుకుని వైద్యం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

అల్లోపతి మందులతో

ఆయుర్వేదం తయార్‌

కొన్ని రకాల వ్యాధులకు అల్లోపతి మందులు త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. పలు రకాల నొప్పులు, జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లకు ఇవి వెంటనే పనిచేస్తాయి. దీనికి కారణం వాటిలో వాడే స్టెరాయిడ్స్‌, నొప్పి నివారణ, యాంటీబయాటిక్స్‌ మాత్రలే. అదే ఆయుర్వేద వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చే మందులు కొంతకాలం తర్వాత శరీరంలో మెరుగైన ఫలితాలు చూపిస్తాయని చెబుతారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక మొండి వ్యాధులను తగ్గించుకునేందుకు రోగులు ఆయుర్వేద మందుల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించకుండా స్నేహితులు, తెలిసిన వారు చెప్పారని కల్తీ, నకిలీ మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని రకాల మందుల్లో ఆయుర్వేద పొడులు, అల్లోపతిలో లభించే యాంటిబయాటిక్స్‌, నొప్పి నివారణ, స్టెరాయిడ్స్‌ కలిపి వాటిని ప్రత్యేక యంత్రాల ద్వారా మాత్రలు తయారు చేసి ప్యాకింగ్‌ చేసి రోగులకు అంటగడుతున్నారు. వాస్తవంగా అల్లోపతి మందులు వైద్యులు సూచించిన మేరకు నిర్ణీత రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ అల్లోపతి మందులు కలిపిన ఆయుర్వేద మందులు వాడుతూ రోగులు ప్రాణం మీదకు తెస్తున్నారు. గతంలో కర్నూలులోని వీకర్‌సెక్షన్‌ కాలనీ, శిల్పాటౌన్‌షిప్‌ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు నకిలీ ఆయుర్వేద మందులు తయారు చేస్తూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ అధికారులకు పట్టుపడ్డారు. వీరు తయారు చేసిన మందులను గ్రామాలు, పట్టణాలు తిరిగి అమాయకులైన వారికి అంటగట్టి సొమ్ము సంపాదించారు. ఇలాంటి వారు ఇప్పటికీ సమాజంలో ఇళ్లలో వ్యాపారాలు చేస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. అల్లోపతి మాదిరిగా ఆయుర్వేద మందులకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో జిల్లాలో నకిలీ మందుల తయారీ అధికమైంది. ఎప్పుడైనా విజిలెన్స్‌ అధికారులు నిర్వహించే దాడుల్లో మాత్రమే నకిలీ మందులు బయటపడుతున్నాయి.

దాడుల్లో పట్టుబడిన నకిలీ మందులు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గత నెల 23 నుంచి 27వ తేదీ వరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లులు, ఆయుష్‌ విభాగం మెడికల్‌ ఆఫీసర్లు సంయుక్తంగా పలు ఔషధ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో విస్తృతంగా నకిలీ మందులు విక్రయిస్తున్నట్లు వారి తనిఖీల్లో బయటపడింది. స్థానిక పాతబస్టాండ్‌లోని శ్రీ సంజీవిని ఆయుర్వేదిక్‌ దుకాణంలో జీఎంపీ సర్టిఫికెట్‌ లేని మూడు ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొత్తబస్టాండ్‌ సమీపంలోని సిరిగిరి వెంకప్ప ఆయుర్వేదిక్‌ స్టోర్‌లో అనుమతిలేని కంపెనీల మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పాతబస్టాండ్‌లోని మహావీర్‌ మెడికల్‌ ఏజెన్సీలో ఆయుష్‌ విభాగం అనుమతి లేకుండా పలు రకాల ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నంద్యాలలో వెంకప్ప ఆయుర్వేదిక్‌ ఏజెన్సీని సందర్శించి బిల్లులు సరిగా లేని మందులను సేకరించారు. ఈ మేరకు సంబంధిత వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి చర్యలకు సిఫారసు చేశారు.

కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌కు సిద్దేశ్వర్‌ కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. స్నేహితుడు చెప్పడంతో స్థానిక ఓల్డ్‌టౌన్‌లోని ఓ ఆయుర్వేద మందుల దుకాణానికి వెళ్లి మందులు కొన్నాడు. ఆ మందులు వాడిన కొద్దిసేపటికే అతని కడుపులో మంట మొదలైంది. ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. కడుపులో ఆరాటం, తీవ్ర ఆకలి వంటి లక్షణాలు కనిపించాయి. ఉపశమనం కోసం వెంటనే రెండు గ్లాసుల మజ్జిగ తాగి ఆ మందులు పడేసి ఊరుకున్నాడు. విషయాన్ని ప్రభుత్వ వైద్యుడికి చెబితే అవి నకిలీ మందులని, వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకుండా వాడొద్దని హెచ్చరించారు.

కల్లూరుకు చెందిన అనిల్‌కుమార్‌ నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు చెప్పడంతో అల్లోపతి వైద్యుల వద్దకు గాకుండా కోడుమూరులో నాటు మందులు ఇచ్చే వైద్యుని వద్దకు వెళ్లాడు. రెండుసార్లు నాటు కట్టు వేయించుకున్నా ఫలితం లేకపోగా నొప్పి మరింత అధికమైంది. దీంతో వెంటనే అల్లోపతి వైద్యుడిని సంప్రదించి ఆపరేషన్‌ చేయించుకున్నాడు.

ఎమ్మిగనూరుకు చెందిన పెద్ద ఈరన్న లైంగిక శక్తి కోసం కర్నూలులోని ఓ లాడ్జిలో మందులు ఇస్తారని స్నేహితులు చెప్పడంతో గత నెలలో వచ్చి మందులు తీసుకున్నాడు. అవి వాడిన కొద్దిసేపు ఫలితం కనిపిస్తున్నా రానురాను పరిస్థితి మరింత దిగజారింది. దీంతో భయపడి పెద్దాసుపత్రికి వచ్చి యురాలజిస్టును కలిసి తన పరిస్థితిని వివరించి మందులు వాడటంతో బాగయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement