బీపీ, షుగర్‌లే ఎక్కువ
కర్నూలు(హాస్పిటల్): చిన్నా పెద్దా తేడా లేదు. పట్టణ, గ్రామీణ అన్న తారతమ్యం అసలే లేదు. మారిన జీవనశైలి కారణంగా సమాజంలో ఎక్కడ చూసినా దీర్ఘకాలిక వ్యాధిపీడితులే కనిపిస్తున్నారు. అందులో ఎక్కువ మందిని బాధపెట్టే బీపీ, షుగర్ వ్యాధిలే ఉన్నాయి. ఒకప్పుడు వందలో ఏ ఒక్కరో ఇద్దరో ఇలాంటి రోగులుండేవారు. ఇప్పుడు పది మందిలో ఒకరిద్దరు ఉంటున్నారు. వీరు వచ్చిన రోగాలను తగ్గించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వే 3.0 ద్వారా వెల్లడవుతోంది. జిల్లాలో గత నెల 14వ తేదీ నుంచి ఎన్‌సీడీ 3.0 సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఏడాది వరకు ఈ స్క్రీనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ స్క్రీనింగ్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఒక ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశ, పట్టణ ప్రాంతంలో ఏఎన్‌ఎం, ఆశాలు కలిపి ఒక బృందంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 909 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. వీరిలో 127 మంది మెడికల్ ఆఫీసర్లు, 28 మంది నర్సులు, 428 మంది సీహెచ్‌వోలు, 326 మంది ఏఎన్‌ఎంలు శిక్షణ పొందారు. ఎన్‌సీడీ సర్వే 3.0లో భాగంగా ప్రతి బృందం రోజుకు ఐదు కుటుంబాలను పరిశీలిస్తోంది. 18 ఏళ్లపైబడిన వారందరికీ ఈ స్క్రీనింగ్‌లో భాగంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మౌఖికంగా రొమ్ము, సర్వికల్ క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఆరోగ్య విద్య, పరిశుభ్రత ప్రాముఖ్యతను ఆరోగ్య బృందం ఇంటి వద్దనే అందిస్తోంది. అనుమానిత కేసులను పీహెచ్‌సీ/యుపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వద్దకు పంపిస్తున్నారు. అక్కడ కూడా నివృత్తి కాని కేసులను కర్నూలు ప్రభుత్వ సర్వ జన వైద్యశాల, క్యాన్సర్ ఆసుపత్రికి పంపిస్తున్నారు.
ఎక్కువగా బీపీ, షుగర్ బాధితులే...
జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారు 18,72,547 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నవంబర్ 14 నుంచి చేపట్టిన సర్వేలో ఇప్పటి వరకు 1,88,351 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 13,132 మందికి బీపీ, 8,208 మందికి షుగర్, 12 మందికి నోటి క్యాన్సర్, 33 మందికి రొమ్ము క్యాన్స ర్, 16 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్న ట్లు నిర్దారించారు. మరో 97,294 మందికి పైవ్యాధులున్నట్లు అనుమానితులుగా పేర్కొంటూ వైద్యాధికారుల వద్దకు రెఫ ర్ చేశారు. ఇందులో 18,018 మందికి బీపీ, 14,686 మందికి షుగర్, 598 మందికి నోటి క్యాన్సర్, 413 మందికి రొమ్ము క్యాన్సర్, 667 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
బీపీ 20 శాతం, షుగర్ 18 శాతం మందికి
తర్వాత స్థానంలో నోటి క్యాన్సర్
ఎన్‌సీడీ సర్వేలో వెల్లడి
జిల్లాలో ఇప్పటికి 20 శాతం సర్వే పూర్తి
జిల్లాలో 672 బృందాలతో సర్వే
రోజూ ఒక్కో బృందం ఐదు కుటుంబాల సర్వే
సర్వేకు ఏడాది సమయం
పట్టణాల్లో అధికంగా బాధితులు
బీపీ, షుగర్ బాధితులు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పట్టణాల్లో వ్యాధిపీడితులు పెరగడానికి కారణం కూడా పూర్తిగా ఎరువులు, క్రిమిసంహారక మందులతో పండిన ఆహారాన్ని తినడం, వంశపారంపర్యం, శారీరక వ్యాయామం తగ్గిపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, మానసిక ఒత్తిళ్లు కారణంగా నాన్ కమ్యూనిటి డిసీజ్(అంటువ్యాధి కాని వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్) వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చేయాలని, దూమ, మద్యపానం మానేయాలని, తెల్ల అన్నానికి బదు లు కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే మిల్లెట్స్ తినాలని, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ముమ్మరంగా ఎన్‌సీడీ 3.0 సర్వే
ఎన్‌సీడీ 3.0 సర్వే ముమ్మరంగా సాగుతోంది. మొదట్లో కొద్దిగా నెమ్మదించినా ప్రస్తుతం సర్వే ఊపందుకుంది. ఒక్కో బృందం రోజుకు ఐదు ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తున్నారు. ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
–హేమలత, ఎన్‌సీడీ అధికారిణి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment