రేషన్ బియ్యం మాయమనేది కట్టుకథ
● అవాస్తవాలను మాజీ మంత్రి బుగ్గనకు ఆపాదించడం వెనుక కుట్ర ● వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు
డోన్: నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీకి చెందిన వారి బఫర్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని కొందరు అర్థం లేని ఆరోపణలు చేస్తుండటం వారి అవివేకానికి నిదర్శనమని బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఉర్దూ అకాడమీ స్టేట్ మాజీ డైరెక్టర్ ముర్తుజావలి, వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్ ఖాజాహుసేన్, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, ఇబ్రహీం, దస్తగిరి విమర్శించారు. శనివారం వారు మాజీ మంత్రి బుగ్గన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. బేతంచెర్ల బఫర్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం అని సంబంధిత అధికారులు, గోడౌన్ నిర్వాహకుల వివరణ లేకుండా ఏకపక్షంగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై పత్రికల్లో రాయడం ఏమి జర్నలిజమని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చెప్పిందే నిజమని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఏడుగురు సభ్యులు కలిసి నిర్మించుకున్న ఈ బఫర్ గోడౌన్ నిర్వహణను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బలవంతంగా లాక్కున్నారన్నారు. ఇందులో రేషన్ బియ్యం తేడా వస్తే ఈనెల 31వ తేదీలోపు అధికారులకు నిర్వాహకుడు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికి, మాజీ మంత్రికి ఏమి సంబంధమని వారు నిలదీశారు. సెలవు ఉన్న క్రిస్మస్ రోజు టీడీపీ నాయకుని మాటలు నమ్మి అధికారులు గోడౌన్‌ను తనిఖీ చేశారన్నారు. సరుకులో తేడా వస్తే నిర్వాహకులకులతో సంజాయిషీ తీసుకోవాలన్నారు. కానీ అలాంటిదేమీ లేకున్నా బుగ్గనపై నిందలు వేయడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాలలో బఫర్ గోడౌన్ ఉండగా, బేతంచెర్ల గోడౌన్‌లోనే బియ్యాన్ని ఎందుకు నిల్వ ఉంచారని కొందరు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. డోన్, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాలకు రవాణా చేసేందుకు బేతంచెర్ల అనువుగా ఉండటం, ఇక్కడ రైల్వే డంపింగ్ యార్డు సౌకర్యం కూడా ఉండటంతో ప్రభుత్వం బఫర్ గోడౌన్‌ను ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వీటి మూలంగా రవాణా, హమాలీ చార్జీల ద్వారా ఏటా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఆదా అవుతోందన్నారు. వాస్తవాలు తెలుసుకొని కథనాలు ప్రచురించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment