సాంకేతిక పరిజ్ఞానంతో పరుగు పోటీలు
● అడుగడుగునా నిఘా నేత్రాలు ● పోలీసు అభ్యర్థులకు వివిధ పరీక్షల కోసం సర్వం సిద్ధం ● రేపటి నుంచి ఏపీఎస్పీ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు: పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పోటీల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో హై ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయిలో క్రీడాపోటీలు, రైల్వే, కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పోలీసు ఉద్యోగాల ఎంపికకు పనిచేసిన సంస్థ ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. దీంతో పాటు పోలీసు శాఖకు చెందిన ఐటీ కోర్ విభాగం సిబ్బంది సేవలు అందిస్తున్నారు. పోటీలు, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఆ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో ఎత్తు, ఛాతీ కొలత, 1600, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు జరిగే ప్రతిచోటా నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను మరింత పెంచనున్నారు.
సెన్సార్లు, చిప్స్ వినియోగం
అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మొదలైనప్పటినుంచి వారి ఛాతీ నెంబర్‌పై క్యూర్ కోడ్‌తో కూడిన బ్యాడ్జితో పాటు పరుగు పోటీల సమయంలో కాళ్లకు సెన్సార్ చిప్స్ అమర్చిన ట్యాగులు ఏర్పాటు చేయనున్నారు. వాటిని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సర్వర్‌కు అనుసంధానం చేస్తున్నారు. పరుగు మొదలై ముగిసే సమయం వరకు ప్రతి సెకను ఆ చిప్స్ ద్వారా కంప్యూటర్‌లో నమోదవుతుంది. ఎత్తు, కొలత యంత్రంలో తల పైభాగం, కాళ్ల అడుగు భాగంలోనూ సెన్సార్లు ఉంటాయి. ఇలా ప్రతి విభాగంలో చిన్నపాటి పొరపాట్లకు తావు లేకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించింది మొదలు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకుని మైదానం నుంచి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
పది వేల మందికి పైగా అభ్యర్థులు
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 10,143 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈనెల 30 నుంచి రోజూ 600 మంది అభ్యర్థుల చొప్పున పోటీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లా నుంచి పోలీసు అధికారులు, పరిపాలనా విభాగం సిబ్బందిని నియమించారు.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
పోలీసు ఉద్యోగాల నియామక విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోకండి. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, రిక్రూట్‌మెంట్లు అయినా పారదర్శకంగానే జరుగుతాయని గుర్తించాలి. దళారులు/మోసగాళ్లు ఎవరైనా అభ్యర్థులను సంప్రదిస్తే డయల్ 100 లేదా 112 గాని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అలాంటి వారి సమాచారం గోప్యంగా ఉంచుతాం. కర్నూలు జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 7777877722 లేదా 9121101100కు తెలియజేస్తే అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
– బిందు మాధవ్, జిల్లా ఎస్పీ
అభ్యర్థులకు సూచనలు ఇవీ..
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ అటెస్టెడ్ జి రాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించనియెడల అభ్యర్థిత్వాన్ని అక్కడే తిరస్కరిస్తారు. వారికి సమయం కూడా కేటాయించరు.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ మార్కు లిస్టులతో పాటు డిగ్రీ మార్కు లిస్టు, ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు చూపించాలి.
ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికెట్ (6 నెలల లోపు) ఉండాలి, బీసీ అభ్యర్థులు విధిగా క్రిమి లేయర్ సర్టిఫికెట్‌ను తీసుకురావాలి (నోటిఫికేషన్ విడుదల తేదీ తర్వాత మాత్రమే ఉండాలి).
4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఎన్‌సీసీ, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారు ఒరిజినల్స్ తీసుకురావాలి.
ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారు ట్రైబ్ సర్టిఫికె ట్లు కలిగి ఉండాలి. తీవ్రవాదులు, సంఘ విద్రోహు ల దాడిలో చనిపోయిన పోలీసు కుటుంబాల పిల్ల లు సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలనలో చూపాలి.
చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సర్టిఫికెట్ (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లోపు అధికారుల పిల్లలకు మాత్రమే).
ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికెట్ (సర్వీస్ బుక్‌తో పాటు).
మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు చూపించాలి.
కాల్ లెటర్‌లో తెలిపిన స్కోర్ కార్డు (ఒరిజినల్ రిజల్ట్ చూపించాలి).
స్టేజ్1, స్టేజ్2 అప్లికేషన్లను తప్పనిసరిగా తీసుకురావాలి.
Comments
Please login to add a commentAdd a comment