పదోన్నతులకు నేడు కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: మున్సిపల్ స్కూళ్లలో ఎస్‌జీటీలుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అర్హుల సీనియారిటీ జాబితా డీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, జాబితాలో ఉన్న వారు తమ సేవ పుస్తకం, అర్హత ధ్రువీకరణ పత్రాలు (రెండు సెట్లను)తీసుకొని డీఈఓ ఆఫీస్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు.
నేడు 20 గ్రామాల్లో
రెవెన్యూ సదస్సులు
కర్నూలు(సెంట్రల్): జల్లాలోని 20 గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదోని డివిజన్‌లో గోనెగొండ్ల మండలం పెద్దమర్రివీడు, నందవరం మండలం జోహరాపురం, ఎమ్మిగనూరు మండలం కందనాతి, కోసిగి మండలం సజ్జలగూడెం, ఎండపల్లి, కౌతాళం మండలం పోడలకుంట మదిర, మంత్రాలయం మండలం బసాపురం, ఆదోనిమండలం కపటి, హోళగుందమండలం హోళగుంద గ్రామాల్లో సదస్సులు జరుగునున్నట్లు తెలిపారు. అలాగే కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఓర్వకల్ మండలం తిప్పాయపల్లి, కల్లూరు మండలం బస్తిపాడు, వెల్దుర్తి మండలం నర్లాపురం, కర్నూలు రూరల్ ఎదురూరు, పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల కేంద్రం తుగ్గలి, ఆలూరు కమ్మరచేడు, చిప్పగిరి ఖజాపురం, ఆస్పరి తురువగల్, హలహర్వి గూళ్యం, జె.కోసల్లిలలో జరిగే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
మోహిని అలంకరణలో గోదాదేవి
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉత్సవమూర్తి గోదాదేవి మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాస పూజల్లో భాగంగా ముందుగా ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామితోపాటు శ్రీ గోదాదేవి అమ్మవారిని యాగశాలలో కొలువుంచి వేదపండితుల కనులపండువగా నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం, అర్చన నిర్వహించారు. త ర్వాత ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తి గోదాదేవిని మోహిని గా అలంకరించి మాడ వీధుల్లో ఊరేగించారు.
సా..గుతున్న
కంప్యూటరీకరణ!
● కేడీసీసీ బ్యాంక్‌లో పూర్తిగా
నిలిచిన రుణాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ సాగుతూనే ఉంది. దీని వల్ల రుణాల పంపిణీ ప్రక్రియ పూర్తిగా బంద్ అయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఫిబ్రవరి నెలలో జాతీయ స్థాయిలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి పీఏసీఎస్‌కు రూ.4 లక్షలు కేటాయించింది. కర్నూలు జిల్లాలో 43 పీఏసీఎస్‌లు ఉండగా... ప్రీ మైగ్రేషన్‌కు వచ్చింది కేవలం 26 సంఘాలు మాత్రమే. ఇందులో కూడా 23 సంఘాల్లోనే ప్రీ మైగ్రేషన్ పూర్తి అయింది. అంటే 50 శాతం సంఘాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన సంఘాల ప్రీ మైగ్రేషన్ ఎప్పటికి పూర్తవుతుందనేది జవాబు లేని ప్రశ్న. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న లావాదేవీలను కూడా కంప్యూటరీకరణ చేయాల్సి ఉంది. అక్టోబరు 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం. అయితే, డిసెంబరు నెల ముగింపునకు వస్తున్నా పూర్తి కాలేదు. అధికారులు కూడా ఈ ప్రక్రియ పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీశైలంలో విజిలెన్స్
అధికారుల తనిఖీలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం రీజనల్ విజిలెన్స్ అధికారి చౌడేశ్వరి ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ విభాగంలో తనిఖీలు చేశారు. గతంలో దేవస్థానంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారు గణేష్ సదనం, నక్షత్రవనం, సరిహద్దు నిర్మాణ పనులపై విచారణ చేపట్టి, పలు రికార్డులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment