ఆహార కల్తీ వ్యాపారులకు జరిమానా
కర్నూలు(హాస్పిటల్): ఆహార కల్తీ చేయడంపై జిల్లాలో పలువురు వ్యాపారులపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య జరిమానా విధించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆహార భద్రత సిబ్బంది జిల్లాలోని పలు వ్యాపార దుకాణాలపై దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. ఇందులో ఆరు నాసిరకం, ఒకటి ఎక్స్‌పైరీ తేదీ దాటిన కూల్‌డ్రింక్స్ విక్రయం, రెండు వంటనూనెను తిరిగి మరిగించడం(టీపీసీ) కేసులు ఉన్నాయి. ఇందులో నాసిరకం ఆహార పదార్థాలు విక్రయించిన ఆదోని బెస్ట్ బేకరీ స్వీట్స్ షాప్‌నకు రూ.30 వేలు, పత్తికొండ బాలాజీ బిస్కట్ షాప్‌నకు రూ.20 వేలు, ఆదోని విశాల్ మెగా మార్ట్‌కు రూ.50 వేలు, ఎమ్మిగనూరు శ్రీసాయి కేక్ ప్యాలెస్‌కు రూ.30 వేలు, మోర్ సూపర్ మార్కెట్‌కు రూ.20 వేలు, సికింద్రాబాద్‌లోని ఆహార పదార్థాల ఉత్పత్తిదారునికి రూ.50 వేలు, సూర్యోదయ సూపర్ మార్కెట్‌కు రూ.10 వేలు, కర్నూలులోని నాగేంద్రనగర్ అభయాంజనేయ ఏజెన్సీస్‌కు రూ.10 వేలు, గణేష్ నగర్‌లోని వై. నీలావతమ్మ టిఫిన్ సెంటర్‌కు రూ.1000, చల్లా ఫుడ్ కోర్ట్‌కు రూ.2,500 జరిమానా విధించారు.
రైలు ఢీకొని
గొర్రెల కాపరి దుర్మరణం
పాణ్యం: మండల పరిధిలోని కందికాయపల్లె, కృష్ణమ్మ కోన సమీపంలో శుక్రవారం రైలు ఇంజిన్ ఢీకొని గొర్రెల కాపరి కురువ శంకర్ (35) మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమారుడు శంకర్ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేకలు మేపుకోవడానికి కొండకు వెళ్లాడు. రైలు ట్రాక్ దాటుతున్న సమయంలో నూతనంగా నిర్మిస్తున్న ట్రాక్‌ను పరిశీలించేందుకు వచ్చిన సేఫ్టీ రైలు ఇంజిన్ ఢీకొంది. ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment