సాగునీటి సరఫరాలో స్పష్టత ఇవ్వలేదు
● ఏఈ శ్రీనివాస నాయక్
జూపాడుబంగ్లా: కర్నూలు–కడప కాల్వ కింద సాగుచేసిన రబీ పంటలకు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సాగునీరు సరఫరా చేస్తారో ఉన్నతాధికారులు తమకు స్పష్టత ఇవ్వలేదని, ఆ విషయం ఉన్నతాధికారులకే తెలుసని కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏఈ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో కేసీ కాల్వ వాటాగా 10 టీఎంసీలు కేటాయించగా అందులో 3 టీఎంసీలు అనంతపురం తాగునీటికి మళ్లిస్తే కేవలం కేసీ కాల్వకు 7 టీఎంసీల నీళ్లు మిగులుతాయన్నారు. తుంగభద్ర డ్యాం వద్ద 7 టీఎంసీల నీటిని విడుదల చేస్తే కేసీ కాల్వకు కేవలం 3 టీఎంసీల నీళ్లు మాత్రమే చేరతాయన్నారు. దీంతో 3 టీఎంసీల నీటిని మార్చి దాకా ఎలా విడుదల చేస్తారనే విషయం ఉన్నతాధికారులకే తెలుసని ఏఈ వెల్లడించారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరే వరకు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీ కాల్వకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీ కాల్వకు విడుదల చేస్తున్న నీరు కౌంటింగ్ అవుతుందని ఏఈ వెల్లడించారు. ఏబీఆర్ కాల్వకు సాగునీరు సరఫరా చేయాలని తూడిచెర్ల సర్పంచ్ బాలమద్దిలేటి ఏఈని కోరగా.. ఏబీఆర్ కాల్వ కింద నానాయకట్టు ఉందని, వందల ఎకరాల్లో సాగుచేసిన నానాయకట్టుకు సాగునీరు ఇవ్వటం వీలుకాదని ఏఈ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment