తుమ్మలూరులో విషాదం
● బావిలో మహిళ మృతదేహాన్ని వెలికితీసేందుకు వెళ్లి ఊపిరాడక మరొకరు మృతి ● ఇరువురిది ఒకే గ్రామం
జూపాడుబంగ్లా/పాములపాడు: బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతదేహాన్ని వెలికితీసేందుకు వెళ్లి మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మృతులిద్దరిది ఒకే గ్రామం. దీంతో పాములపాడు మండలం తుమ్మలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తుమ్మలూరు గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మమ్మ (53) అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై ఆదివారం మధ్యాహ్నం 80 బన్నూరు రెవెన్యూ పరిధిలోని చుక్కాపుల్లారెడ్డి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె మృతదేహం కోసం బావిలో గాలించసాగారు. ఇందులో తెలుగు లక్ష్మీనారాయణ(44) అనే వ్యక్తి నీటిలో గాలించే సమయంలో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు బావిలోనే మృతిచెందటంతో వారి మృతదేహాల కోసం సోమవారం గ్రామస్తులు ఇనుప కొక్కేలు వేసి గాలించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో లక్ష్మీనారాయణ మృతదేహం లభించగా, సాయంత్రం 4గంటల ప్రాంతంలో లక్ష్మమ్మ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కాగా లక్ష్మీనారాయణకు భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తెలుగు లక్ష్మమ్మకు భర్త మోహన్‌రావు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సంఘటన జరిగిన ప్రాంతం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసుకొని మృతదేహాలకు నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహింపజేసి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment