ఇంటి వద్ద పింఛన్ ఒట్టిదే!
● ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రమే ● అవ్వాతాతలకు సచివాలయాల మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ● పలుచోట్ల సర్వర్ పనిచేయక కార్యాలయాల్లోనే పడిగాపులు
సర్వర్ మొరాయించి..
దాడికి దారితీసి
ఆదోని అర్బన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్ సమస్య వేధిస్తోంది. ఈ కారణంతో పలుచోట్ల సచివాలయ ఉద్యోగులు ఇళ్లవద్దకెళ్లి పింఛన్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు బయటకువెళ్లి తెచ్చుకోవడం సమస్యగా మారింది. ఈ విషయంలోనే శనివారం ఆదోనిలో పింఛన్‌దారుడి కుమారుడు, సచివాలయ ఉద్యోగి మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 33వ వార్డు సచివాలయ ఎడ్యుకేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ శనివారం పింఛన్ పంపిణీ చేసేందుకు ఖాజీపురవీధిలోకి వెళ్లాడు. సర్వర్ రావడం లేదని వీధిలో పంపిణీ చేస్తున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న ఇబ్రహీంను బయటకు వచ్చి పింఛన్ తీసుకెళ్లాలని చెప్పడంతో అతని కుమారుడు ఖలందర్ తన తండ్రి బయటకు రాలేడని ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలని కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చేయిచేసుకునే వరకు వెళ్లింది. కాగా పింఛన్‌దారుడు కుమారుడు ఖలందర్ తనపై దాడి చేశాడని సచివాలయ ఉద్యోగి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్‌ఐ రామస్వామి తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ పేరుకు మాత్రమే. పింఛన్ సొమ్మును అందించేందుకు సచివాలయ ఉద్యోగులెవ్వరూ ఇంటి వద్దకు రాకపోవడంతో అవ్వాతాతలు, వికలాంగులు ఇతర పింఛన్‌దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సచివాలయాలు, రచ్చబండల దగ్గర పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్ సొ మ్ము అందజేస్తున్నారని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా... ఆచరణలో అది కనిపించడం లేదు. ఫిబ్ర వరి నెలకు సంబంధించి కూడా పంపిణీ ఇంటి వద్ద జరగకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో సర్వర్ పనిచేయకపోవడంతో మధ్యాహ్నం వరకు అవ్వాతాతలు కాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి సర్వర్ పనిచేయడంతో పంపిణీ కొంత ఊపందుకుంది.
95 శాతం పింఛన్ల పంపిణీ
ఫిబ్రవరి నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,54, 924 పింఛన్‌లకు రూ.194 కోట్లు మంజూరయ్యా యి. ఇందులో కర్నూలు జిల్లాలో 2,39,332 పింఛన్లు ఉండగా 2,27,714 (95.15 శాతం)మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,592 పింఛన్లు ఉండగా 2,03,401 (94.35 శాతం)మందికి పంపిణీ చేశారు. అయితే,ఈ పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలో 4,879 మంది, నంద్యాల జిల్లాలో 4,394 మంది పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఇంటి దగ్గరే పింఛన్
వైఎస్సార్‌సీపీ పాలనలో 2024 మార్చి నెల వరకు ప్రతి లబ్ధిదారుడికి ఇంటి దగ్గరే పింఛన్ సొమ్ము అందజేయడం జరిగేది. వలంటరీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పింఛన్లు పొందడంలో అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధి గ్రస్తులు ఎవ్వరు ఇబ్బంది పడలేదు. ఐదేళ్లు ప్రశాంతంగా పింఛన్లు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పింఛన్‌దారులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
అర్హులందరికీ పింఛన్లు
దేవనకొండ: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా తెలిపారు. శనివారం దేవనకొండ మండలం కరివేముల గ్రామ సచివాలయ పరిధిలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు, వృద్ధులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకు ఆయన సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. పత్తికొండ ఆర్‌డీవో భరత్‌నాయక్, డీఆర్‌డీఏ పీడీ శివనాగలీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment