శ్రీకరం.. శుభకరం
గణపతి, కలశ పూజ నిర్వహిస్తున్న పండితులు
● శాస్త్రోక్తంగా ఉరుకుంద క్షేత్ర కుంభాభిషేకానికి అంకురార్పణ
మంత్రాలయం/కౌతాళం: అణువణువునా వేదం పలికింది. తనువుతనువు ఈరన్న స్మరణ పఠించింది. ఈరన్న శరణు ఘోషతో ఉరుకుంద క్షేత్రం పరవశించింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపుడు ఉరుకుంద ఈరన్న స్వామి కుంభాభిషేక ఘట్టానికి మొదటి రోజు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో శనివారం కుంభాభిషేక వేడుక ప్రారంభమైంది. ఆలయ పండితులు, అధికారులు కలశాలతో ఊరేగింపుగా మంగళవాయిద్యాలతో యాగశాల ప్రవేశం చేశారు. యాగశాలలో శైవాగమ శాస్త్ర ప్రవీణ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, గోమాత, గణపతి పూజోత్సవాలు వైభవంగా చేపట్టారు. దీక్షారాధన, త్రిశూల పూజలు అనంతరం ప్రసాద వితరణ చేశారు. కుంభాభిషేక నిమిత్తం దేశంలోని సప్త నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను యాగశాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పుణ్యాహవాచనంలో ప్రముఖ సిద్ధాంతి సీతారామానుజ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్.రాఘవేంద్రరెడ్డి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, డివిజన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు వెంకటేశ్వర రావు, మల్లికార్జున,ప్రధాన అర్చకుడు ఈరన్న పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా కలాపకర్షణ
కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా చేపట్టిన కలాపకర్షణ వేడుక శాస్త్రోక్తంగా సాగింది. విమాన రాజగోపురం శిఖరాగ్రానికి చేరుకుని కలాపకర్షణ క్రతువు కానిచ్చారు. వేద పఠనం గావిస్తూ జీర్ణోద్ధరణలో భాగంగా గోపురంపై పాత కలశాలను తొలగించారు. ఈరన్న స్వామి శక్తి స్వరూపాలుగా వర్ధిల్లిన కలశాల శక్తిని నూతన కలశంలోకి ఆవాహం గావించి కలాపకర్షణ చేపట్టారు. ఈ క్రతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే యాగమంటపంలో నలుదిశలా రుగ్వేద, అధర్వణ వేద, శ్రీకృష్ణ రుగ్వేద, శుక్ల రుగ్వేద పఠన గావించారు. వేద పఠనతో క్షేత్రమంతా మార్మోగింది.
Comments
Please login to add a commentAdd a comment