ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
● డీఈఓ శామ్యూల్ పాల్
ఎమ్మిగనూరుటౌన్: పరీక్షల భయం వీడి ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. శనివారం పట్టణంలోని మాచా ని సోమప్ప బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యను హెచ్‌ఎం కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థినిలతో పరీక్షలపై సమావేశాన్ని నిర్వహించి సూచనలు చేశారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివి పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో 1:25 రేషియోలో ఉపాధ్యాయులు వుండేలా చర్యలు తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఆదోని డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓలు ఆంజినేయులు, మధుసూదన్‌రాజు పాల్గొన్నారు.
అలారు దిన్నె బ్రిడ్జిపై రాకపోకలు బంద్
కర్నూలు న్యూసిటీ: జిల్లా కేంద్రం నుంచి బళ్లారి వెళ్లే మార్గంలో అలారు దిన్నె గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి దెబ్బతినడంతో నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు నిషేధించినట్లు రోడ్లు, భవనాల శాఖ డీఈఈ సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బళ్లారి, ఆలూరు నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనాలను ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మీదుగా మళ్లించినట్లు వివరించారు. కర్నూలు నుంచి ఆలూరు, బళ్లారి వైపు వెళ్లే వాహనాలను దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి మీదుగా మళ్లించినట్లు వెల్లడించారు. త్వరలో బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను
సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ రాజీవ్ రైతులకు సూచించారు. శనివారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కార్యాలయంలో కందుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. కందుల నాణ్యతను కూడ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కర్నూలు, కల్లూరు, గూడూరు మండలాల్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోళ్లు చేస్తామని వివరించారు. కందులకు మద్దతు ధర రూ.7550 ఉందని, రైతులు తగిన నాణ్యతా ప్రమాణాలతో తెస్తే మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం తేమ 12 శాతం లోపు ఉండాలని సూచించారు.
నేడు వసంత పంచమి
● కొలను భారతిలో ఏర్పాట్లు పూర్తి
కొత్తపల్లి: సరస్వతి దేవి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం కొలనుభారతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ రామలింగారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, అక్షరాభ్యాస స్థలం, భక్తులు సేదతీరేందుకు టెంట్లు, భోజన, తాగునీటి సౌకర్యం, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రిఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: ఈ నెల 19 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ వద్ద ప్రస్తుతం ఉన్న 15 కేంద్రాలతో పాటు అదనంగా మరో 8కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద తగినన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment