పన్ను నుంచి మినహాయింపు
● కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి కర్నూలు జిల్లా
ప్రజల పెదవి విరుపు
● ప్రకటనకే పరిమితమైన ఓర్వకల్లు
ఇండస్ట్రియల్ కారిడార్
● కర్నూలు నుంచి అమరావతికి
రైలు లేదు..పెండింగ్ ప్రాజెక్టులకు
నిధులు లేవు
● నిరుత్సాహం వ్యక్తం చేసిన
వివిధ పార్టీల నాయకులు
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు పెదవి విరిచారు. ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి ఆయువుగా భావిస్తున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు పైసా విదల్చలేదు. కర్నూలు నుంచి అమరావతికి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును వేయలేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉన్నా నిధులను సాధించడంలో విఫలమైందని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నాయకులు, కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర నిధుల కేటాయింపు చేపట్టలేదని ఆరోపించారు. కార్మికులకు, నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు.
ఉద్యోగ అవకాశాలు మృగ్యం
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో 2,600 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని 2024 జూన్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రస్తావన లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కారిడార్ వృద్ధి పథంలోకి వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షలకుపైగా ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
వినతులు బుట్టదాఖలు
కర్నూలు నుంచి విజయవాడకు రైలును నడపాలని మంత్రి టీజీ భరత్..రైల్వే మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే కర్నూలు ఎంపీ బస్తిపాటినాగరాజు కూడా రైల్వే మంత్రిని పలుమార్లు అభ్యర్థించారు. అయితే వారి విన్నపాలను రైల్వే శాఖ పట్టించుకోనట్లుగా ఉంది. మంత్రాలయం మార్గం, రిహబులిటీ వర్కుషాపునకు నిధులు కేటాయించలేదు.
జిల్లాకు ఒక క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలపడంతో జిల్లాలోని 6,20,658 మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
అర్బన్ లాంచ్ ప్రోగ్రామ్ కింద పట్టణాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లను కేటాయించారు. ఈపథకం కింద స్మార్ట్‌సిటీల కింద ఎంపికై న కర్నూలు, ఆదోని పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య వసతులను మెరుగు పరచేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కర్నూలు జిల్లాలో ట్రెజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం వీరికి ఊరట ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment