వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
● వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో టీడీపీ వర్గీయుల దాడి ● వివాహ వేడుకను అడ్డుకుని దౌర్జన్యం
సి.బెళగల్: వివాహ వేడుకను అడ్డుకుని టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హతం చేసే లక్ష్యంతో వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో వైఎస్సార్‌సీపీ వర్గీయులకు చెందిన యువకుడి వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. రాత్రి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారు పెళ్లి వేడుక ఊరేగింపు (మెరివెన)ను నిర్వహిస్తున్నారు. గ్రామంలోని తమ ఇళ్ల దగ్గర ఊరేగించేందుకు వీలు లేదని టీడీపీ వర్గీయులు ప్రధాన రోడ్డుపై అడ్డుగా రెండు చోట్ల రాళ్లను పెట్టారు. వైఎస్సార్‌సీపీ వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసుల సూచనలతో రోడ్డును అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించారు. ఊరేగింపు వెనక నుంచి టీడీపీకి చెందిన పాండు కుమారుడు వెంకటేష్ ఆటోలో వస్తూ వాదనకు దిగాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే అప్పటికే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను వారికి సర్ది చెప్పి పెళ్లి ఊరేగింపు బంద్ చేయించారు. ఘర్షణకు కారణమైన పాండు కుమారుడు వెంకటేష్ శనివారం ఉదయం రెచ్చగొట్టాడు. టీడీపీ వారు మూకుమ్మడిగా వేటకొడవళ్లు, ఇనుపరాడ్లు, ఖాళీ మద్యం సీసాలు, పట్టుడు కట్టెలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మేకల రాముడు, తిమ్మన్న, బండ రాయుడు, బాలరాజులను హతం చేసేందుకు టీడీపీ వర్గీయులు యత్నం చేశారు. తల, కాలుపై వేటకొడవళ్లతో తీవ్రంగా నరికారు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలో టీడీపీకి చెందిన పాండు కుమారుడు వెంకటేష్, నరసింహుడు కుమారుడు వెంకటేష్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు.
గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ
ఇరువర్గాల ఘర్షణ విషయం తెలుసుకున్న కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ బ్రాహ్మణదొడ్డి గ్రామం చేరుకున్నారు. ఘర్షణ వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రత పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. డీఎస్పీ వెంట కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్‌ఐ తిమ్మయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment