పురుగుల మందుతాగి ఆత్మహత్య
నర్సింహులపేట: మండలంలోని పెద్దనాగారం శివారు రేకులతండాకు చెందిన గుగులోతు లచ్చు(55)అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మాలోతు సురేష్ కథనం ప్రకారం.. తండాకు చెందిన లచ్చు మద్యానికి బానిసై నిత్యం తాగడంతో శరీరంలోని అవయవాలు అన్ని దెబ్బతిన్నాయి. ఆరోగ్యం క్షిణించడంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు లచ్చు మృతి చెందాడు. మృతుడి భార్య మజ్జి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చోరీపై కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఈదులపూసపల్లి, అనంతారం గ్రామాల పరిధిలోని వ్యవసాయ బావులకు అమర్చిన మూడు విద్యుత్ మోటార్లు చోరీ జరుగగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి మంగళవారం తెలిపారు. ఈదులపూసపల్లికి చెందిన రైతు గట్ల వెంకన్న వ్యవసాయ బావి వద్ద గల రూ.12వేల విలువ చేసే విద్యుత్ మోటార్ చోరీకి గురైందన్నారు. బయ్యారం మండలానికి చెందిన ఎండీ.గౌస్‌కు చెందిన రూ.15వేల విలువ గల రెండు విద్యుత్ మోటార్లు అపహరణకు గురయ్యాయని తెలిపారు.
వివాహిత బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపెల్లి గణేష్ భార్య దివ్య అలియాస్ సుకన్య (22) మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపెల్లి ఎల్లయ్య, ఎల్లమ్మ కుమారుడు గణేశ్‌తో సీరోలు మండలం కొత్తూరు (సి) గ్రామానికి చెందిన గొర్రెపాటి జ్యోతి, వీరన్న (లేటు) చిన్న కుమార్తె దివ్య అలియాస్ సుకన్యతో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం గణేశ్, సుకన్య కొత్తూరు (సి) గ్రామానికి వెళ్లి వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుకన్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చీకటిపడ్డాక అత్తమామలు ఎల్లమ్మ, ఎల్లయ్య ఇంటిలోకి వెళ్లి గది వద్ద కోడలి కోసం పిలుస్తుండగా ఆమె బయటకు రాకపోవటంతో తలుపులు తొలగించి చూశారు. అప్పటికే సుకన్య ఉరివేసుకుని ఉండగా తాడు తొలగించి కిందకు దింపి చూసే సరికి మృతిచెందింది. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి సుకన్య మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్ట్‌మార్టం గదికి తరలించారు. మృతురాలి బంధువులు ఆస్పత్రికి చేరుకొని ఆగ్రహంతో భర్త గణేశ్ దాడి చేశారు. పోలీసులు చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.
32బస్తాల ధాన్యం చోరీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామ శివారులో రైతు పత్రి భరత్ ఆరబోసుకున్న 32 బస్తాల (21 క్వింటాళ్ల) చిట్టిపొట్టి రకం ధాన్యం చోరీకి గురి కాగా మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఉంచి సోమవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి రూ.60 వేల విలువగల 32 బస్తాల ధాన్యం కనిపించకపోవటంతో ఆందోళనకు గురై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment