మద్దతు ధర చట్టం చేయాలి
నెహ్రూసెంటర్: రైతుల పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేసి ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు అఖిల భారత రైతు కూలీ సంఘాల (ఏఐకేఎంఎస్) విలీన సభ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకట్రామయ్య మాట్లాడుతూ... మద్దతు ధర లేక అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పగించేలా చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర, చట్టాలు అమలు చేయాలని రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వాలు మాత్రం నిర్బంధాలు ప్రయోగిస్తూ, దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రైతు భరోసా, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది దాటిన రైతులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసి వ్యవసాయ రంగ చట్టాలు, ఎంఎస్‌పీ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మండల వెంకన్న, గౌని ఐలయ్య పిలుపునిచ్చారు. కోటేశ్వర్‌రావు, భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరామి రెడ్డి, సత్యం, రాజు, సత్యనారాయణ, లాల్‌కుమార్, డేవిడ్‌కుమార్, భూమన్న, నందగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు
వెంకట్రామయ్య
Comments
Please login to add a commentAdd a comment