కనీస వేతనం అమలు చేయాలి
నెహ్రూసెంటర్: పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలను ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు సలాం కొట్టడం, సన్మానాలు చేయడం కాదు వారి కుటుంబాలను పోషించుకునేందుకు కనీస వేతనం ఇచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. కార్మికులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, రాష్ట్రంలో 17మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో 60 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారని, వారందరినీ రెగ్యులరైజ్ చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి కార్మికులకు వేతనాలు పెంచి నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీయూసీఐ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణ, కె.సూర్యం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్, నాయకులు కిరణ్, యాకూబ్‌షావలి, మల్లేషం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి రవి, బిల్లకంటి సూర్యం, నారాయణ, కిరణ్, మహేందర్, గురువయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు, కుమార్, యాదమ్మ, భూలక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Comments
Please login to add a commentAdd a comment